హైదరాబాద్: తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీ కానున్నారు. కేసీఆర్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రానికి వివిధ పద్దులకింద రావాల్సిన బకాయిలు, ఆర్థిక సాయం తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. ఎల్లుండి కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ అవుతారు. ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఢిల్లీ బయలుదేరతారు.
మోడి ప్రధానమంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరూ ఢిల్లీలో రెండుసార్లు మాత్రమే భేటీ అయ్యారు. గత ఏడాది అక్టోబర్ నెలలో జరిపిన ఢిల్లీ పర్యటనలో అయుత చండీ మహాయాగానికి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని కేసీఆర్ భావించినప్పటికీ, మోడి అపాయింట్మెంట్ లభించలేదు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా మోడి ఇక్కడకు రాలేదు. దీనిపై కేసీఆర్ కుమార్తె కవిత ఇటీవల తరచూ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. మోడి తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మోడితో కేసీఆర్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.