మూడో తేదీ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేతపై కేంద్రం అంత సానుకూలంగా లేదన్న సంకేతాలు ముందుగానే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీల సమస్య పరిష్కారానికి.. కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడానికి కేంద్రం.. ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. మేడే రోజు ఆరు స్పెషల్ ట్రైన్స్ ను నడిపించారు. అందులో ఒకటి లింగంపల్లి నుంచి జార్ఖండ్ కు వెళ్లింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన కూలీలు, పర్యాటకులు, విద్యార్థుల్ని ఇతరుల్ని ప్రత్యేక రైళ్లలో తరలించవచ్చని.. కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేకంగా రైల్వే శాఖ నోడల్ ఆఫీసర్లను నియమిస్తుందని తెలిపింది.
రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లను కొత్తగా ప్రకటిచిన కేంద్రం… రెడ్ జోన్లు మినహా మిగతా వాటిలో ఆంక్షలను సడలించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును మాత్రం ఇప్పుడల్లా… వినియోగంలోకి తెచ్చే అవకాశం లేదని.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ద్వారా ఓ అంచనా వచ్చేసిందని అంటున్నారు. ఆంక్షలు సడలించినా… జనం గుమికూడే ప్రదేశాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వరు. రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు సహా.. దేనికీ అనుమతి ఉండే అవకాశం లేదు. మెట్రో సిటీలు అన్నీ రెడ్ జోన్లలోనే ఉంటున్నాయి కాబట్టి.. అక్కడ కూలీలకు ఇప్పుడల్లా ఉపాధి లభించే అవకాశం లేదన్న అభిప్రాయం ఉంది. అందుకే కేంద్రం.. కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
నలభై రోజుల పాటు ఉపాధి లేకపోయినా ఓపిక పట్టిన కూలీలు.. ఇప్పుడు కంట్రోల్ తప్పిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో బీహార్, జార్ఖండ్ కూలీలు పోలీసులపై దాడి చేశారు. వారిని రెండు రోజుల్లోనే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి.. బీహార్ తరలించారు. గుజరాత్ నుంచి నాలుగువేల మంది మత్స్యకారుల్ని ఏపీ సర్కార్ ఏపీకి తీసుకు వస్తోంది. ఇక నుంచి ప్రత్యేకరైళ్ల సదుపాయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇలా ఏపీకి వచ్చే వారందర్నీ క్వారంటైన్ లో ఉంచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ కూడా ఆదేశించారు.