మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. నలబై రోజుల లాక్ డౌన్ పరిస్థితులను ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమీక్షించారు. అన్ని రకాల పరిస్థితుల్ని పరిశీలించి.. మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్డౌన్ పరిస్థితులు.. కొనసాగింపు నిర్ణయం… దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై నరేద్రమోడీ శనివారం ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. లాక్ డౌన్ సందర్భంగా.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. రెడ్ జోన్లకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేవు. రాష్ట్రాల మధ్య రాకపోకలు మరో రెండు వారాల పాటు ఉండవు.
బస్సులు , రైళ్లు, మెట్రో రైళ్లకు పర్మిషన్ లేదు. దేశీయ విమానాలకు కూడా పర్మిషన్ లేదు. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్ డౌన్.. ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాలు.. తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు.. అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలకుగా విభజించి.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా పేర్లు పెట్టి కొన్ని మినహాయింపులు ఇస్తూ పోతున్నారు. అయితే.. ఆ మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. ఇప్పుడు కేంద్రం.. మే పదిహేడో తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించింది. అయితే.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో దాదాపుగా అన్ని సాధారణ వ్యాపార వ్యవహారాలకు అవకాశం కల్పిస్తోంది. ఫలితంగా.. చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిర్మాణ కార్యక్రమాలకు కూడా షరతుల మీద అనుమతి ఉంది.
లాక్డౌన్ పొడిగించినా.. నిబంధనల ప్రకారం.. కొత్తగా కేసులు నమోదు కానీ.. ప్రాంతాలను రెడ్ జోన్ల నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మారుస్తూ ఉంటారు. ఇలా మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిబంధనలను సడలిస్తారు. ఈ ప్రకారం చూస్తే.. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అమలవుతున్నట్లుగా భావించవచ్చు. మెల్లగా రెడ్ జోన్లన్నింటినీ గ్రీన్ జోన్లుగా మార్చడంతో.. లాక్ డౌన్ పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ నిబంధనలు కొనసాగుతాయి.