సినిమా భవిష్యత్తేమిటన్నది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు. అది లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంత వరకూ ఎవరి అంచనాలు వాళ్లవి. ఎవరి లెక్కలు వాళ్లవి. కనీసం చిత్రసీమ పుంజుకోవడానికి ఆరు నెలల నుంచి యేడాది సమయం పడడం ఖాయం. వాక్సిన్ వచ్చి, కరోనా వల్ల జనాలకు ఇక ఏమాత్రం భయం లేదు అన్నప్పుడే మళ్లీ థియేటర్లు కళకళలాడతాయి. అప్పుడే షూటింగులు, కొత్త సినిమాల హడావుడి కనిపిస్తుంది.
అయితే వర్క్ ఫ్రమ్ హోం ఇలానే కొనసాగితే.. సినిమాలకు మళ్లీ స్వర్ణయుగం రావడం ఖాయమని.. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు వ్యాఖ్యానించారు. కంపెనీలు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవడానికీ, పొదుపు మంత్రం పాటించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ఓ అస్త్రంగా ఎంచుకునే అవకాశం ఉందన్నది ఆయన ఉద్దేశం. ఇంట్లోనే ఆఫీసు పని పూర్తి చేసుకునేవాళ్లు.. సాయింత్రం అయ్యే సరికి, సినిమాలు, షాపింగులు, వినోద కార్యక్రమాలపై దృష్టిపెడతారని, అప్పుడు సినిమా వైపు ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని సురేష్ బాబు అంచనా వేస్తున్నారు. తాజాగా సురేష్ ప్రొడక్షన్ వెబ్ సిరీస్‌ల నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. ఇక మీదట.. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి విరివిగా వెబ్ సిరీస్‌లు వస్తాయి. అయితే… తమ తొలి ప్రాధాన్యం మాత్రం సినిమాల రూపకల్పనకే అని, సినిమాలు ఇచ్చే కిక్ ఇంకెక్కడా దొరకదని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.