ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వస్తుంది.. పోతుందన్న అభిప్రాయంతో ఉన్నప్పటికీ తేలిగ్గా తీసుకోవాలనుకోడం లేదు. కరోనాను ఎదుర్కోవడంలో ఓ ప్రత్యేకమైన కార్యాచరణను అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం మొత్తం.. కనీసం లక్ష క్వారంటైన్ బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో కనీసం పది నుంచి పదిహేను బెడ్లు ఉండేలా.. ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే.. ఐదు వందల వరకు ఆర్టీసీ బస్సులను రూపు మార్చి నిత్యావసర సరుకుల పంపిణీకి అనుకూలంగా తీర్చిదిద్దాలని .. అందులోనే.. పాలు, గుడ్ల కూడా నిల్వ ఉంచేలా ఫ్రీజర్లు కూడా ఉండాలన్నారు.
ఈ మొబైల్ యూనిట్లో కూరగాయలు, పాలు మాత్రమే కాదు.. ఓ డాక్టర్, మరో ఎఎన్ఎం..మరో ఆశాకార్యకర్త.. అలాగే మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వలస కూలీల్ని వెనక్కి తెప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేయడంతో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వలస కూలీలు స్వగ్రామాలకు రానున్నారు. వీరు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఉంటారు. గల్ఫ్ లోనూ… పెద్ద ఎత్తున తెలుగు వారు ఉంటారు. వారిని కూడా వెనక్కి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కారణంగా.. అలా వచ్చే వారందర్నీ ముందస్తుగా క్వారంటైన్లో ఉంచాలి. ఇందు కోసం లక్ష బెడ్లు అవసరం అవుతాయని.. ముఖ్యమంత్రి అంచనా వేశారు. ఐదు వందల బస్సుల్ని మొబైల్ యూనిట్లుగా మార్చాలంటే.. చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం.. వీలైనంత త్వరగా బస్సుల్ని మొబైల్ యూనిట్లుగా మారుస్తామని సీఎంకు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ కోవిడ్ ఆస్పత్రిని సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా క్వారంటైన్ బెడ్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు గ్రామాల వారీగా సిద్ధం చేయబోతున్నారు.