టాలీవుడ్ కి అసలే కథల కొరత. కొత్త కొత్త కథల్ని పట్టుకోవడంలో తడబడుతూ ఉంటుంది. అందుకే మన దగ్గర రొటీన్ కథలెక్కువగా కనిపిస్తుంటాయి. రీమేక్‌లపై ఆధార పడేదీ అందుకే. అయితే నవతరం దర్శకులు కొత్త పాయింట్లు వెదికి ఆ లోటు కాస్త తీరుస్తున్నారు. తాజా సామాజిక పరిణామాలపై ఫోకస్ చేస్తూ, వాటి మధ్య కథలు అల్లుతున్నారు. అలాంటి వాళ్లకు కరోనా – లాక్ డౌన్ కూడా ఓ కథావస్తువుగా మారిపోయింది. అవును… లాక్ డౌన్, కరోనా వల్ల టాలీవుడ్ కి జరిగిన మేలేమైనా ఉందంటే.. అది ఇదే.
లాన్ డౌన్ వల్ల జన జీవనం స్థంభించింది. షూటింగులు ఆగిపోయాయి. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. కథలు రాసుకోవడం, స్క్రిప్ట్ తయారు చేసుకోవడం ప్రీ ప్రొడక్షన్ లో కీలకమైన విషయాలు. ప్రస్తుతం వాటికైతే బోలెడంత టైమ్ ఉంది. కరోనా నేపథ్యంలోనూ టాలీవుడ్ లో కొన్ని కథలు సిద్ధం అవుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యాన్ని కేంద్రంగా తీసుకుని.. వాటికి హారర్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ జోనర్లలో సినిమాలు తీయడానికి వ్యూహం రచిస్తున్నారు. అవి సినిమాలుగా మారతాయా? లేదంటే వెబ్ సిరీస్‌లుగా ఆగిపోతాయా? అనేది తరువాతి విషయం. కథలైతే రెడీ అవుతున్నాయి. ఒక్క టాలీవుడ్ లోనే ఆరేడు కథలు కరోనా నేపథ్యంలో తయారవుతున్నాయని టాక్.
ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు మారుతి తెలుగు 360తో మాట్లాడారు. “కరోనా అయిపోయాక.. వాటి నేపథ్యంలో మనకు విస్కృతంగా సినిమాలొస్తాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. వాటిలో నిలబడేవెన్ని? అనేది చూడాలి. కరోనా నేపథ్యంలో కథ అల్లు కోవడం బాగుంటుంది. కానీ.. మెప్పించడం అంత ఆషామాషీ కాదు. లాక్ డౌన్ సమస్యలనే తెరపైనా చూపిస్తానంటే కుదరదు. లాన్‌డౌన్, కరోనా అనేవి అంతర్లీనమైన అంశాలుగా రావాలి. పట్టుకున్న ఎమోషన్ ప్రధానం అవుతుంది. ఎమోషన్ని బాగా చెప్పేవాళ్లే సక్సెస్ అవుతారు. టాలీవుడ్ లోనే కాదు.. అన్ని చోట్లా కరోనా కథలు తయారవుతున్నాయి. అయితే వాటిలో ముందొచ్చే సినిమాలనే ప్రేక్షకులూ ప్రత్యేక దృష్టితో చూస్తారు. నోట్ల రద్దు నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు తయారయ్యాయి. అయితే వాటిలో ఏదీ సరిగా ఆడలేదు. విడుదల కాకుండా ఆగిపోయినవి, స్క్రిప్టు దశలోనే పక్కన పెట్టేసినవి చాలా ఉన్నాయి. కరోనా కూడా అంతే కావొచ్చు” అన్నారు.