గ్రేటర్ సారథుల ఎన్నిక లాంఛనం పూర్తయిపోయింది. నగర మేయర్ గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ సమావేశ భవనంలో గురువారం ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభం అయిన సమావేశంలో సరిగ్గా 20 నిమిషాల కంటె తక్కువ వ్యవధిలోనే మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు మేయర్, డిప్యూటీల ఎన్నిక పర్వం పూర్తయిపోయింది. హైదరాబాదు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. తొలుత ఆయనే సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే మేయర్, డిప్యూటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు పదవులకు ఇద్దరు మహిళా కార్పొరేటర్లు ప్రతిపాదించగా, మరో ఇదరు సెకండ్ చేయడంతో వారి అభ్యర్థిత్వం ఖరారైంది. పోటీగా ఎవ్వరూ లేకపోవడంతో.. వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాహుల్ బొజ్జా ప్రకటించారు. దీంతో ఒక లాంఛనం పూర్తయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గులాబీ పతాకం రెపరెపలాడుతున్నది.
గ్రేటర్ సమావేశానికి ముందు.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తమ పార్టీ తరఫున ఎన్నికైన అందరు కార్పొరేటర్లతో విడిగా ఒక సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గురించి ఆయన సభ్యులకు హితవు చెప్పారు. గ్రేటర్ పురపాలక పరిపాలనలో అవినీతికి తావు లేకుండా చేయాలని కార్పొరేటర్లంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రగతికి బాటలు వేయాలని ఆయన వారిని కోరారు. అక్కడే మేయర్, డిప్యూటీ ల పేర్లను కూడా కేటీఆర్ ప్రకటించారు. అక్కడినుంచి పార్టీ వారంతా నాలుగు బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్పొరేటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ, హిందీల్లో ప్రమాణ స్వీకారం చేసే వారిని విడిగా గ్రూపులు చేసి, అయిదు నిమిషాల్లో వారి ప్రమాణాల్ని ముగించారు. ఆ వెంటనే మరో పది నిమిషాల్లో మేయర్, డిప్యూటీల ఎన్నిక కూడా పూర్తయిపోయింది.