వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో.. పరిస్థితి ఒక్కసారిగా కట్టలు తెగినట్లుగా అయింది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఆంధ్రకు వెళ్లేందుకు జనం బారులు తీరారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈ పాస్ సిస్టంను అమలులోకి తెచ్చారు. లాక్డౌన్ కారణంగా తమ సొంత రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లే వారు tsp.koopid.ai/epass వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. ఆంధ్రకు వెళ్లడానికి ఆన్లైన్ ధరఖాస్తు చేసుకుంటే… అప్రూవ్ చేసి.. ఆన్ లైన్ పాస్ జారీ చేస్తున్నారు. ఒక్క పూటలో ..పాస్‌ల కోసం పదిహేడు వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ దెబ్బకు సర్వర్ కూడా క్రాష్ అయింది. అయినా పోలీసులు మూడు గంటల్లో ఏడు వేల పాస్‌లు క్లియర్ చేశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఎప్పటికిప్పుడు క్లియర్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న ఆంధ్ర వలస కూలీలు కూడా.. స్థానిక అధికారుల వద్ద పాసులు తీసుకుని ఏపీ బోర్డర్‌కు చేరుకుంటున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర బోర్డర్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏపీలోకి వలస కూలీల్ని అనుమతించే విషయంలో ఉన్నతాధికారులు ఏమీ చెప్పకపోవడంతో మధ్యాహ్నం వరకు అందర్నీ బోర్డర్‌లోనే ఉంచేశారు. కొన్ని వేల మంది చెక్ పోస్టుల వద్దకు చేరుకోవడం.. అందరికీ తెలంగాణ పోలీసులు పాసులు ఇవ్వడంతో.. ఇక వారిని ఏపీకి లోకి అనుమతించక తప్పలేదు. పాసులు చెక్ చేసి.. ఏపీలోకి అందర్నీ అనుమతిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం.. హైదరాబాద్‌లో హాస్టల్ స్టూడెంట్స్‌కు పోలీసులు ఇలానే పాసులివ్వడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకుండాపోయింది. ఈ సారి తెలంగాణ పోలీసులు జారీ చేస్తున్న పాసుల్ని పోలీసులు అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ నుంచి వచ్చిన వలస కూలీలను యంత్రాగం సొంత ఖర్చులతో సొంతగ్రామాలకు పంపింది. తమను ఎందుకు పంపరని.. చాలా మంది పోలీసుల్ని నిలదీయడంతో.. ఉన్నతాధికారులు కూడా… ఏపీలోకి అనుమతించలేని పరిస్థితిలోకి వెళ్లారు. ఒక్క తెలంగాణ నుంచి కనీసం లక్ష మంది ఒక్క రోజులో ఏపీకి వెళ్తారని అంచనా వేస్తున్నారు.