జనసేన అధినేత పవన్ పవన్ కల్యాణ్.. చేనేతల కష్టాలు చూసి చలించారు. ఆయన కార్యాలయానికి పెద్ద ఎత్తున చేనేతలు.. తమ సమస్యలను వివరిస్తూ.. సమాచారం పంపుతూండటంతో.. ఆయన తక్షణం వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీలోని మూడు ప్రాంతాల్లోనూ లక్షల మందిలో చేనేత వృత్తిపై ఆధారపడినకుటచంబాలు ఉన్నాయని.. వారెవరికి ప్రస్తుతం పూట గడిచే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని ఈ కుటుంబాలు కోరుతున్నాయి. వారి డిమాండ్ సహేతుకమైనదేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
చేనేత వృత్తిపై ఆధారపడిన వారిపై పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన అభిమానం చూపుతారు. గతంలో మంగళగిరి , ధర్మవరం ప్రాంతాలలో ప్రత్యేకంగా చేనేత వృత్తిలో ఉన్న వారిని కలిసేందుకే వెళ్లారు. వారెవరూ చేనేత కార్మికులు కాదని.. చేనే కళాకారులని పవన్ కల్యాణ్ అంటూంటారు. రాను రాను వారంతా సమస్యల్లో చిక్కుకుపోతున్నారు కానీ.. బయటకు రాలేకపోతున్నారని.. వారి సమస్యను తాను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ధర్మవరం నుంచి కొంత మంది చేనేత ప్రతినిధుల్ని కూడా తాను ఢిల్లీకి తీసుకెళ్తానన్నారు. అయితే.. ఆ తర్వాత రాజకీయాలు మారడంతో.. సాధ్యం కాలేదు. కానీ.. చేనేతల విషయంలో మాత్రం పవన్ కల్యాణ్.. ప్రత్యేకమైన ఆసక్తి చూపుతూనే ఉంటారు.
ఎప్పటికప్పుడు జనసేన నేతల ద్వారా వారి స్థితిగతులు తెలుసుకుంటూడటంతో.. తమ కష్టకాలంలో..ఆదుకోవాలని వారంతా.. జనసేన అధినేతకు విజ్ఞప్తులు పంపుతున్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్ నేరుగా ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వం ఎంత వరకు స్పందిస్తుందన్నది సందేహమే. ఇంతకు ముందు కూడా పవన్ కల్యాణ్… అనేక మంది సమస్యలపై లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. పొరుగున ఉన్న తమిళనాడు సీఎం స్పందించారు… తెలంగాణ గవర్నర్ ప్రశంసించారు కానీ.. ఏపీ సర్కార్ మాత్రం లైట్ తీసుకుంది.