వలస కూలీల్ని ప్రత్యేక రైళ్లలో తరలించడానికి అంగీకరించిన కేంద్రం.. పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. స్లీపర్ చార్జీ మీద.. ఎక్స్ట్రా రూ. 50.. సూపర్ ఫాస్ట్ చార్జీలు ఇతర చార్జీలు కలిపి రైల్వేశాఖ వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే.. ఇవన్న వలస కూలీల వద్ద వసూలు చేయరు. వలస కూలీల్ని తరలించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలి. మేడే రోజు … తొలి శ్రామిక్ రైలు.. లింగంపల్లి నుండి జార్ఖండ్‌లోని హాతియాకు వెళ్లింది. దీని కోసం.. తెలంగాణ సర్కార్.. దాదాపుగా రూ. ఐదున్నర లక్షలు చెల్లించింది. ఇప్పుడు ఆరు వందల ప్రత్యేక రైళ్లను నడపాలనుకుంటున్న రైల్వేశాఖ ప్రభుత్వాల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోంది.
శ్రామిక రైళ్లలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించడంపై రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాక్ డౌన్ ప్రకటించే ముందు ఎవరి ఇళ్లకు వారికి వెళ్లడానికి ప్రభుత్వం నాలుగు గంటల సమయం కూడా ఇవ్వలేదని .. ఇప్పుడు సామాన్యుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే కాంగ్రెస్ పార్టీనే ఆ మొత్తం పెట్టుకుంటుందని.. కూలీలందర్నీ ఉచితంగా.. స్వస్థలాలకు పంపాలని ఆఫర్ ఇచ్చారు. వారి ఖర్చును భరించడం తమకు గౌరవనీయమని ఆమె చెప్పుకొచ్చారు.
అదే సమయంలో… రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. పీఎం కేర్స్ ఫండ్‌కు ఇండియన్ రైల్వేస్ రూ. 150 కోట్లు చందా ఇవ్వబోతోందని.. ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు మరింత పదును పెట్టింది. వలస కూలీల్ని స్వస్థలాలకు చేర్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్న రైల్వే శాఖ… పీఎం కేర్స్‌కు . ఆ డబ్బులను.. ఇస్తోందని.. మండిపడింది. పీఎం కేర్స్ ప్రజల కోసమా… ప్రధాని కోసమా.. అని రాహుల్ గాంధీ ట్విట్టర్లో ప్రశ్నించారు. మొత్తానికి ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వలస కూలీలు ఎట్టకేలకు సొంత ఊళ్లకు వెళ్దామనుకున్నా… కొత్త చిక్కులు తప్పడం లేదు.