కరోనా వల్ల చిత్రసీమ ఘోరంగా నష్టపోతోంది. ఇప్పటికిప్పుడు ఆ నష్టాల్ని లెక్క వేయడం కష్టం గానీ – ఈ నలభై రోజుల లాక్ డౌన్ వల్ల వందల కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. థియేటర్ వ్యవస్థపై ఇది పిడుగు పాటే. రాష్ట్రంలో సుమారు 1800 థియేటర్లున్నాయి. అందులో చాలామట్టుకు లీజ్‌కి ఇచ్చేశారు. కొన్ని ఇంకా యజమానుల చేతుల్లోనే ఉన్నాయి. నలభై రోజుల పాటు అవన్నీ మూసే ఉంచారు. ఎప్పుడు తెరుస్తారో చెప్పలేం. కానీ నిర్వహణా వ్యయం మాత్రం తడిచి మోపెడు అవుతోంది. ఒక్కో థియేటర్ వల్ల వారానికి సుమారు 3 లక్షల ఆదాయం సమకూరుతుంది. నెలకు 12 లక్షలు. అటూ ఇటూగా చూసినా కనీసం ఏడెనిమిది లక్షల నికర ఆదాయం లభించడం ఖాయం. అదంతా ఇప్పుడు నష్టపోయినట్టే.
ఓటీటీల వల్ల సినిమాలు విడుదలైతే, నిర్మాతలు ఎంతో కొంత నష్టాల్ని తగ్గించుకోవొచ్చు. కానీ పూర్తిగా కృంగిపోయేది థియేటర్ల వ్యవస్థే. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ ల నిర్వహణ చాలా కష్టంగా మారింది. అలాగని మల్టీప్లెక్స్‌ల ఆదాయం బాగుందని కాదు. మంచి సినిమాలొస్తే తప్ప – అటు సింగిల్ స్క్రీన్లు, ఇటు మల్టీప్లెక్సులు కళకళలాడవు. సింగిల్ స్క్రీన్ తో పోలిస్తే మల్టీప్లెక్స్ నిర్వహణ మరింత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఈ యేడాది చివరి వరకూ…. థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ తెరచుకున్నా ఈ నష్టాల్ని పూడ్చుకోవడానికి చాలా కాలం పడుతుంది. థియేటర్లే కాదు.. వాటి పై ఆధారపడి నడిచే చాలా వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటి కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయినట్టే. ఈ లాక్ డౌన్ కాలంలో థియేటర్ల వ్యవస్థకు కనీసం 75 నుంచి 90 కోట్ల నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ లెక్కగట్టారు. లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించినా – కొన్ని థియేటర్లు శాశ్వతంగా మూతబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ప్రసన్నకుమార్. కనీసం 10 నుంచి 20 శాతం థియేటర్లు ఇకపై కల్యాణ మండపాలుగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.