తప్పుడు వార్తలు రాసి..
సెన్సు లేని న్యూసెన్సులు నాలుగు పోగేసి…
వ్యక్తిగత విషయాల్లో, జీవితాల్లో దూరి, కెలకాల్సినంత కెలికి – దాన్నే ‘జర్నలిజం ‘ అని మురిసిపోయి, బ్రేకింగు న్యూసులిచ్చాం అని చంకలుగుద్దుకునే ఓ గాసిప్ వెబ్ సైట్ తాట తీశాడు విజయ్ దేవరకొండ. తనదైన స్టైల్లో. ఇప్పుడు ఆ వీడియోనే.. టాలీవుడ్లో బ్రేకింగ్ న్యూస్ గా మారింది.
విజయ్ ఏదైనా సరే.. ముక్కుసూటిగా మాట్లాడతాడు. లోపల ఒకటి, బయట మరోటి ఉండదు. బహుశా.. మిగిలిన హీరోల పక్కన తాను ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఇదే కావొచ్చు. కరోనా వల్ల అల్లాడిపోతున్న తెలుగు ప్రజల్ని ఆదుకోవడానికి హీరోలంతా ముందుకొస్తుంటే – విజయ్ చాలా రోజులు అలికిడి చేయలేదు. ‘విజయ్ ఏదో పెద్ద ప్లాన్ వేశాడు’ అనుకున్నారు ఆయన అభిమానులు. అనుకున్నట్టే.. విజయ్ ఓ పక్కా ప్రణాళికతో ముందుకొచ్చాడు. `మిడిల్ క్లాస్ ఫండ్` పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి, పాతిక లక్షల ప్రాధమిక నిధితో, కనీసం 2 వేల కుటుంబాల్ని ఆదుకోవాలనుకన్నాడు. వెబ్ సైట్ ప్రారంభించిన తరవాత.. విరాళాలు భారీగా వచ్చాయి. 25 లక్షల ఫండ్ కాస్త.. 70 లక్షలకు చేరింది. సాయం అందుకునే కుటుంబాల సంఖ్య పెరిగింది. నిజానికి ఇవన్నీ ఆహ్వానించదగిన పరిణామాలు.
అయితే ఇదంతా ఓ గాసిప్ వెబ్ సైట్ కి నచ్చలేదు. విజయ్‌పై, మిడిల్ క్లాస్ ఫండ్ పై తప్పుడు వార్తలు రాయడం మొదలెట్టింది. మిడిల్ క్లాస్ ఫండ్ తన కార్యకలాపాల్ని మొదలెట్టిన మరుసటి రోజే – విజయ్ పేద ప్రజలని అవమానించాడంటూ ఓ వార్తని వండి వార్చింది. విజయ్ దేవరకొండ ‘కేవలం’ 25 లక్షలు ఇవ్వడం ఏమిటి? ‘కేవలం’ 7500 మందికి సహాయం చేయడం ఏమిటి? ఈ మాత్రందానికి ఎందుకీ హంగామా? రెండు రాష్ట్రాల ప్రజలను అప్లయ్ చేసుకోమనడం ఏమిటి? అంటూ ప్రశ్నలు సంధించింది. హైదరాబాద్‌లో ఏదో ఓ గల్లీని ఎంచుకుంటే సరిపోతుంతి కదా, అంటూ ఉచిత సలహా పారేసింది. ఇది చాలదన్నట్టు… మరో వార్త. చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీకి సాయం చేయకుండా, తన సొంతానికి ఛారిటీ చేస్తున్నాడని, పారలల్ ఇండ్రస్ట్రీని నడపాలని చూస్తున్నాడని ఎవరికీ అర్థం కాని కోణం బయటకు లాగింది.
ఇవన్నీ చూసీ చూసీ విజయ్ దేవరకొండకు విసుగెత్తిపోయి ఉంటుంది. తనదైన స్టైల్లో చురక అంటించడానికి ఓ వీడియో చేశాడు. దాదాపు 21 నిమిషాలు సాగిన ఈ సుదీర్ఘమైన వీడియోలో గాసిప్ వెబ్ సైట్ ని ఓ ఆట ఆడుకున్నాడు. “పక్కనోడ్ని హింసపెట్టి, తొక్కేసి మనం బాగుపడాలి.. మనం ముందుకెళ్లాలి అనే బ్యాచ్” అంటూ ఓ వెబ్ సైట్‌ని.. పేరు చెప్పకుండానే ప్రస్తావించాడు.
“మనల్ని వాడి, మనకు తప్పుడు వార్తలు అమ్మి, వాళ్ల తప్పుడు అభిప్రాయాలు మనమీద రుద్ది.. డబ్బులు చేసుకుంటున్నారు” అంటూ మెల్లమెల్లగా తన ఉధృతిని పెంచుకుంటూ వెళ్లాడు. “మీరు బతికేదే మామీద, యాడ్లు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే, చిల్లర కబుర్లు రాసి, డబ్బులు సంపాదిస్తారు” అంటూ ఎదురు దాడికి దిగాడు. విజయ్ దేవరకొండ ఏడి? ఎక్కడ దాక్కున్నాడు? విరాళాలు ఇవ్వడా? అని ప్రశ్నించిన ఆ వెబ్ సైట్ కి “నాకు కుదిరినప్పుడు, నాకు నచ్చినప్పుడు, నా మనసుకి ఎవరు కనెక్ట్ అయితే. వాళ్లకి ఇస్తా.. అసలు మీరెవరు నన్ను అడగడానికి?“ అంటూ గట్టిగా సమాధానం చెప్పాడు.
సదరు వెబ్ సైట్ ప్రచురించిన వార్త ప్రింటౌట్ తీసి మరీ.. ప్రతీ లైనుకీ వివరణ ఇచ్చుకుంటూ వెళ్లాడు. తన వెబ్ సైట్ కి వచ్చి చూస్తే.. 5వ తరగతి చదివిన పిల్లాడికైనా అర్థమయ్యే విషయాలు “ఓ ముసలాయాన, పెద్దాయన, తాత..”కి అర్థమవ్వలేదంటూ సెటైర్లు వేశాడు (సదరు గాసిప్ వెబ్ సైట్లో వార్తల్ని సేకరించేది, రాసేది ఈ పెద్దాయనే). కేవలం 25 లక్షలు ఇచ్చాడు, కేవలం 7500 మంది కుటుంబాలకు ఇచ్చాడు.. అనే లైన్లు విజయ్‌ని బాగా బాధ పెట్టి ఉంటాయి. “నాకు ఈ ఉచిత సలహాలు మానేసి మీరు సాయం చేయొచ్చు కదా..” అని సదరు వెబ్ సైట్‌కి ఎదురు సలహా ఇచ్చాడు. మిడిల్ క్లాస్ ఫండ్ వల్ల సాయం పొందిన కొంతమంది పేర్లు ప్రస్తావించి, వాళ్ల కష్టాల్ని కళ్లకు కట్టాడు. సీసీసీకి 5 లక్షలు విరాళం అందించానని, అది కూడా తెలియకుండా వార్తలు అల్లేయడం జర్నలిజం అనుకోదని.. క్లాసు పీకాడు.. “రెండు రోజుల క్రితం నన్ను ఇంటర్వ్యూ ఇమ్మని అడిగారు. ఇవ్వకపోవడం వల్ల ఇలా నెగిటీవ్ వార్తలు రాశారు..” అంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు రౌడీ.
ఈ వీడియో మొత్తం చూస్తే సదరు వెబ్ సైట్ వార్తల ముసుగులో చేసే అరాచకాలు, బ్లాక్ మెయిలింగులూ అర్థమైపోతాయి. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కుతిననీదు అన్నట్టుంది ఆ వెబ్ సైట్ పరిస్థితి. తెలుగు ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఏదో రూపంలో వాళ్లకు సహాయం అందాలి అంతే. అది చిన్నదా? పెద్దదా? అనేది తరువాతి విషయం. ఇలా మోకాలు అడ్డడం ఎందుకు? విజయ్ ఓ మంచి పని చేస్తున్నాడు. వీలైతే.. ఆ మంచి పని అందరికీ చేరాలా ఏదైనా చేయాలి. లేదంటే.. ఊరుకోవాలి. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే, అడిగినప్పుడు యాడ్లు ఇవ్వకపోతే – ఏదైనా రాసేయొచ్చా? సదరు గాసిప్ వెబ్ సైట్ జర్నలిజానికి ఏనాడో తిలోదకాలు ఇచ్చేసింది. ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసింది. చేస్తూనే ఉంది. విజయ్ లాంటి వాళ్లు బయటపడి తమ గోల చెప్పుకోగలరంతే. మిగిలినవాళ్లంతా మౌనంగా భరించాల్సిందే కదా? విజయ్ దేవరకొండ లా అప్పుడప్పుడూ కౌంటర్లు ఇవ్వగలిగే ధైర్యం ఎవరైనా చేస్తే.. బ్లాక్ మెయిలింగ్ జర్నలిస్టుల కొమ్ములు విరుస్తాయి.