నలభై రోజులుగా ప్రభుత్వానికి ఆదాయం లేదు. నిన్న ఒక్క రోజే ఖజానా కళకళలాడింది. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 60 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. సగటున ఇదే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. నెలకు ప్రభుత్వానికి రూ. రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది. నలభై రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో.. మందుబాబులు.. బకాయి పడిన తమ ట్యాక్స్ కట్టేందుకు బారులు తీరారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా ఎవర్నీ నిరాశపర్చలేదు. ఈ డిమాండ్ ఉంటుందని ముందే ఊహించారేమో కానీ.. పెద్ద ఎత్తున సరుకు తెచ్చి పెట్టారు. నిన్నటిదాకా శానిటైజర్లు తయారు చేసిన కంపెనీలే .. నేడు మద్యం ఉత్పత్తి చేసి మరీ.. దుకాణాలకు తరలించాయి. దొరకక..దొరకక మద్యం దొరికింది కాబట్టి.. మందుబాబులు బ్రాండ్ల గురించి పట్టించుకోలేదు. ఏదో ఒకటి అని టాక్స్ కట్టడానికే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడటం లేదని మంత్రులు చెబుతూ ఉంటారు. కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తే… మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే.. ప్రభుత్వానికి ఆక్సీజన్ లా కనిపిస్తోంది. ఆంక్షలు ఇతర వాటికి ఎత్తివేసినా.. కార్యకలాపాలు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిర్మాణ రంగం ఇప్పుడల్లా మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు లేవని.. అంటున్నారు. ప్రజల ఆదాయాలు పడిపోవడంతో.. ఇతర వాణిజ్య వస్తువుల కొనుగోలు నిలిచిపోయింది. దీంతో ఆయా ఆర్థిక వ్యవహారాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావడం కష్టమే. కానీ మద్యం అమ్మకాల ద్వారా మాత్రం పెద్ద ఎత్తున నిధులు సమకూరడం ఖాయంగా కనిపిస్తోంది.
మద్యం అమ్మకాల్లో పన్నుల రూపంలో దాదాపు 80 శాతం ప్రభుత్వానికే చేరుతోంది. మద్యం అసలు ధరకి… అమ్మే ధరకు మధ్య చాలా తేడా ఉంటుంది. అంటే.. ఓ మందు బాబు 200 పెట్టి మద్యంబాటిల్ కొంటే.. పన్నుల రూపంలో రూ. 150 వరకూ ప్రభుత్వానికి చేరుతుంది. మిగతా వాటిలో ఉత్పత్తిదారునికి.. ఇతర ఖర్చులు ఉంటాయి. ఈ ప్రకారం.. చూస్తే.. మందుబాబుల సొమ్మును ప్రభుత్వం పీల్చేస్తున్నట్లే లెక్క. మద్యం దుకాణాల ముందు నిలబడిన వారిలో అత్యధికారులు రోజు కూలీలు, నిరుపేదలే. వారి వద్ద ఉన్న అరకొర సొమ్మును ఇలా మద్యం రూపంలో ప్రభుత్వానికి కట్టేస్తున్నారు.