తెలంగాణలో మద్యం దుకాణాల ప్రారంభానికి కేసీఆర్ సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు తెరవడంతో ఏర్పడిన పరిస్థితులపై కేసీఆర్.. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. నిన్నటి వరకూ.. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కనిపించింది. కానీ.. ఏపీలో పరిణామాలు చూసిన తర్వాత.. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గడానికి ఎలాంటి నిబంధనలు పెట్టినా పాటించేవారు ఉండరన్న అభిప్రాయం వ్యక్తమయింది. అధికారవర్గాల నుంచి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమయింది.
హైదరాబాద్ రెడ్ జోన్లో ఉందని.. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయాల్లో… మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం మంచిది కాదన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకూ ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. మంత్రివర్గ సమావేశం సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో మద్యం అమ్మకాల విషయంలో.. మంత్రులందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీతో పోలిస్తే..తెలంగాణలో మద్యానికి మరింత ఎక్కువ డిమాండ్ ఉంటుందనే అంచనాలో అధికారులు ఉన్నారు. లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. కొన్ని మినహాయిలు ఇచ్చే అవకాశం ఉంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పరిమితంగా ఆయినా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేలా వెసులుబాటు ఇవ్వనున్నారు. మద్యం దుకాణాలకు పర్మిషన్ మాత్రం.. కొన్నాళ్లకు ఆగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.