“పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి.. ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించారు. కానీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మున్సిపల్ చట్టం మార్చలేదు. అంటే… రమేష్ కుమార్.. మున్సిపల్ ఎన్నికలకు.. ఎస్ఈసీగా పని చేస్తున్నట్లేనా..?” … తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారంటూ.. నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్పై హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తికి వచ్చిన సందేహం ఇది. ఈ సందేహానికి ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. వాదనలు ఈ రోజు కూడా జరగనున్నాయి. ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు.. నేరుగా విచారణ జరుపుతోంది.
ప్రత్యేకంగా పాసులిచ్చి.. న్యాయవాదులకు హైకోర్టుకు వచ్చేలా చూశారు. వారందరూ.. హైకోర్టుకు వచ్చి తమ వాదనలు వినిపిస్తున్నారు. రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. సుదీర్ఘంగా వాదనలు జరిగినా.. పాస్ వర్డ్ లీక్ అయిందన్న కారణంగా న్యాయమూర్తులు.. డైరక్ట్ విచారణకు రావాలని ఆదేశించారు. ఆ ప్రకారం.. సోమవారం నుంచి హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ రాజ్యాంగ విరుద్ధం అన్న కోణంలోనే ఎక్కువగా వాదనలు జరిగాయి కానీ.. కొత్తగా సోమవారం.. పంచాయతీ రాజ్ చట్ట సవరణ అంశం తెరపైకి వచ్చింది.
పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తే… ఆ శాఖకు వర్తిస్తుంది. మరి మున్సిపల్ చట్టానికి సవరణ చేశారా..? అన్న మౌలికమైన అనుమానం.. ధర్మాసనానికి వచ్చింది.ఇప్పటి వరకూ .. పంచాయతీరాజ్ చట్టానికే మార్పులు చేస్తూ… ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. మున్సిపల్ చట్టం గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుందోనని.. న్యాయవాద వర్గాల్లో ఆసక్తి ప్రారంభమయింది.