జోన్ల వారీగా లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలలో నిన్న మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆరు వారాల పాటు ఎంతో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తే, నిన్న ఒక్కరోజే జనాలు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా వైన్ షాపుల వద్ద బారులు తీరి ఇన్నాళ్ళ లాక్ డౌన్ ని పరిహసించినట్లుగా ప్రవర్తించారు.
అయితే వైన్ షాపుల వద్ద జనాల రద్దీ తగ్గించడానికి, అదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో స్పెషల్ కరోనా ఫీ ఇవాల్టి నుంచి అమలు చేయనుంది. ఈ స్పెషల్ ఫీ కారణంగా ఢిల్లీలో మద్యం ధరలు 70 శాతం మేరకు పెరగనున్నాయి. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో 3500 కోట్ల ఆదాయం వస్తే , ఈ ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీ రాష్ట్రానికి కేవలం 300 కోట్లు మాత్రమే ఆదాయంగా వచ్చినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ లోటును పూడ్చుకోవడానికి, అదే సమయంలో వైన్ షాపుల వద్ద రద్దీ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ అంటున్నారు.
ఏది ఏమైనా ఢిల్లీలోని మందుబాబులకు ఇది షాక్ కలిగించే వార్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే కోవలో మందు రేట్లు బాగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో పెంచిన రేట్లతో ఏ బ్రాండ్ కావలిస్తే ఆ బ్రాండ్ కొనుక్కునే సదుపాయం ఉంటే, ఆంధ్ర లో మాత్రం పెంచిన రేట్లతో కూడా జగన్ ప్రభుత్వం అనుమతించిన కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.