లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతబడ్డాయి. విడుదలకు సిద్ధమైన సినిమాలు.. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? అని ఎదురుచూస్తున్నాయి. ఈమధ్య ఉన్న టైమ్ ని క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా.. ఇలా గత నెలలో విడుదల కావాల్సిన సినిమాలు పది వరకూ ఉన్నాయి. వాటిని ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఆమేజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ 5 లాంటి ఓటీటీ సంస్థలు గట్టి ప్రయత్నాలు చేశాయి, చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమేజాన్ తో నిశ్శబ్దం సినిమా డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. ముందు నుంచీ.. ఈ సినిమా ఓటీటీ లిస్టులో ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టార్లంతా ఈ సినిమాలో ఉన్నారు. అన్ని భాషల్లోనూ వీక్షణలు బాగుంటాయి. కాబట్టి ఓటీటీకి ఇది లాభసాటి సినిమాగా కనిపించింది. అయితే నిశ్శబ్దం టీమ్ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంది. `మేం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాం…` అని గట్టిగా పట్టుబడి కూర్చుంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం మెత్తబడింది. అమేజాన్తో ఓ డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. అన్ని భాషల రైట్స్ రూ.30 కోట్లకు అమేజాన్ సొంతం చేసుకుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ డీల్ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.