లాక్ డౌన్ వల్ల అన్ని వ్యవస్థలతో పాటు సినిమా కూడా స్థంభించిపోయింది. షూటింగులు ఆగిపోయాయి. కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. వాళ్లంతా షూటింగులు ఎప్పుడు మొదలవుతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చిత్రసీమలోని ప్రముఖ నిర్మాతలంతా కలిసి మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయమై.. తలసాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
చిత్రసీమ ఎదుర్కుంటున్న సమస్యల గురించి నిర్మాతలు ఓ వినతి పత్రం అందించారు. దాన్ని బాగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాం.
లాక్ డౌన్ అయిపోయాక.. ఇండ్రస్టరీ పెద్దలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తా. వాళ్ల సలహాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం.
థియేటర్ రంగం పూర్తిగా నష్టాల్లో ఉంది. వాటికి సంబంధించిన కరెంటు బిల్లుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం. నిర్మాతలు అప్పులు చేసి మరీ సినిమాలు తీస్తారు. వాటికి సంబంధించిన వడ్డీలు పెరిగిపోతున్నాయి. బ్యాంకు లోన్స్ కి ఎవరెవరువెళ్లారో ఐడియా లేదు. బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీల విషయంలోనూ ఆలోచిస్తాం.
తెలుగులో యేడాదికి 200 సినిమాల షూటింగులు జరుగుతుంటాయి. టీవీ షూటింగులు వంద వరకూ జరుగుతాయి. ఆదిథ్యం, వాతావరణం.. లొకేషన్ల విషయంలో హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయాక కూడా చిత్రసీమ విజయవంతంగా ముందుకు వెళ్తోంది.
చలన చిత్ర పరిశ్రమకు కులాలు, ప్రాంతాలూ లేవు. సింగిల్ విండో విధానం ద్వారా.. షూటింగ్లకు పర్మిషన్లు ఇచ్చాం. ఇబ్బందుల్ని దూరం చేశాం.
కరోనాకు ముందే చిరంజీవి, నాగార్జునలతో చర్చించి పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో.. తెలుసుకున్నాం. చిత్రసీమలో చాలా సంఘాలు, సమాఖ్యలు ఉన్నాయి. అవన్నీ గొడుగు కింద రావడానికి ఓ సైట్ ఏర్పాటు చేయాలి.
షూటింగులకు పర్మిషన్లు ఇవ్వడం పెద్ద ఇషయం కాదు. కానీ ఏ రూపంలో వస్తుందో అర్థం కాని వైరస్ ఇది. కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. దశల వారిగా కొన్ని పర్మిషన్లు ఇస్తున్నాం. షూటింగులు కూడా… అందులో భాగం కావొచ్చు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేని పోని తొందరపాటుతో ఇబ్బందులు తెచ్చుకోకూడదు. ఈ నెలాఖరు వరకూ ఆగండి. జూన్ నుంచి ఆలోచిద్దాం. సీరియళ్ల నిర్మాణానికి కూడా ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు.
కేరళ ప్రభుత్వం చిత్రసీమకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. మిగిలిన ప్రభుత్వాలు వీటిపై తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూసి. అవన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటా.
ప్రభుత్వం సినీ పరిశ్రమకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా.. చిత్రసీమ పెద్దలతో చర్చిస్తాం. ఎందుకంటే చిత్రసీమకు ఏం కావాలో మాకంటే వాళ్లకే బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఈ విషయమై చర్చిస్తాం. ఎందుకంటే.. పరిశ్రమ అనేది రెండు చోట్లా ఉంది.
మంచి చేయాలి అనుకున్నప్పుడ చెడు జరిగితే.. చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
చాలామందికి ఉద్యోగాలు పోయాయి. పోతున్నాయి కూడా. చిత్రసీమలో మాత్రం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే.. దేశంలోనే అత్యధిక సినిమాలు ఇక్కడే తయారవుతున్నాయి. మనవాళ్లకు పాక్షికంగా ఇబ్బందులు ఎదుర్కుంటారేమో గానీ, ఆ కష్టాలు శాశ్వతం కాదు.