ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో.. ఏపీ సర్కార్ కొత్తగా విడుదల చేసిన జీవో నెంబర్ 623కి సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఈ జీవో ఇచ్చారని ఓ లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు జీవో నెంబర్ 623ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెంబర్ 623లో ప్రభుత్వ భవనాలపై రంగులకు కొత్త అర్థం చెప్పింది. భూమికి, మట్టికి ప్రతిబింబంగా టెర్రకోట రంగు.. పంటలు, హరిత విప్లవానికి గుర్తుగా ఆకు పచ్చ రంగు..నీరు, మత్స్య విప్లవానికి గుర్తుగా నీలం రంగు.. క్షీర విప్లవానికి గుర్తుగా తెలుపు రంగు ఉంటాయని జీవోలో ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ వైసీపీ జెండాలోని రంగులే. కొత్తగా టెర్రకోట రంగును మాత్రం ఓ లైన్ కలపాలని సూచించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నింటికీ.. వైసీపీ రంగులు వేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు వేయడంతో.. హైకోర్టు ఆ రంగుల్ని తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలపై ఏ పార్టీ రంగులు ఉండకూడదు. అది నిబంధన. కానీ అధికారిక ఉత్తర్వులు ఇచ్చి మరీ రంగులు వేయించారు. అవి వైసీపీ రంగులు కాదని.. ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కానీ.. పార్టీ రంగులో కాదో తాము పోల్చుకోగలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ జరిపి.. ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. తొలి విచారణలోనే ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
ఆ తర్వాత కూడా ప్రభుత్వం రంగులు తొలగించలేదు. రంగులు తొలగించడానికి మూడు నెలల సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ సమయం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వతా మూడు వారాల సమయం ఇచ్చింది. రంగులు తొలగించిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మరో రకంగా ఆలోచించింది. ఉన్న వైసీపీ రంగులకే.. కొత్త అర్థాలు చెబుతూ.. జీవో ఇచ్చింది. కొత్తగా ఓ రంగు లైన్ను మాత్రం యాడ్ చేసింది. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలయింది. రంగుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో కొత్త ప్లాన్ అమలు చేస్తారో.. అన్నింటికీ తెలుపు రంగులు వేస్తారో చూడాలి..!