చిత్రసీమలో ఈగోలెక్కువ. నువ్వెంత? అంటే నువ్వెంత? అనుకునే రకం. చిన్న చిన్న ప్రతీకారాల్ని సైతం మనసులో దాచుకుని, ఎదురు దెబ్బలు తియడానికి ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ దొరుకుతాడా? తొక్కేద్దాం? అని కాపు కాచుకుని కూర్చుంటారు. అందుకే రాజకీయాల్లోనే కాదు, చిత్రసీమలోనూ ప్రతీకార దాడులుంటాయి. కానీ జరిగిన అవమానాన్ని దిగమింగుకుని, సాటి మనిషికి మంచి చేసే పెద్ద మనసు కొందరికే ఉంటుంది. అందుకు నిలువెత్తు సాక్ష్యం దాసరి నారాయణరావు.
భీమ్ సింగ్ దగ్గర దాసరి సహాయకుడిగా పనిచేస్తున్న రోజులవి. ‘ఒకే కుటుంబం’ షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్, కాంతారావు ముఖ్య పాత్రధారులు. ఎన్టీఆర్ తో షూటింగ్ అంటే.. సెట్ అంతా చాలా క్రమశిక్షణతో మెలిగేది. ఉదయం ఐదింటికల్లా సెట్లో అడుగుపెట్టడం ఎన్టీఆర్ అలవాటు. కాంతారావు లాంటి స్టార్లు కూడా ఎన్టీఆర్ కంటే ముందు ఉండాల్సివచ్చేది. పాపం.. కాంతారావుకి ఉదయాన్నే సెట్ కి రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది. ”రామారావు గారు వస్తే.. రానివ్వండి. మిగిలినవాళ్లు పని ఉన్నా, లేకున్నా.. సెట్లో ఉండడం ఎందుకు” అంటూ కాంతారావు తన సన్నిహితుల దగ్గర చెప్పి వాపోయేవారు. కానీ అవతల ఉన్నది ఎన్టీఆర్ కదా, తప్పేది కాదు.
ఓరోజు భీమ్ సింగ్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పటికి `ఒకే కుటుంబం` సగం మాత్రమే పూర్తయ్యింది. ”అన్నగారూ… నేను బాలీవుడ్ వెళ్లి సినిమా చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇది. మీరు అనుమతి ఇస్తే.. అక్కడికి వెళ్లిపోతా” అంటూ ఎన్టీఆర్‌ని అనుమతి అడిగారు భీమ్ సింగ్. ”మరి దర్శకుడు ఎవరు?” అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు భీమ్ సింగ్ మదిలో మెదిలిన పేరు.. దాసరి నారాయణ రావు. ”కుర్రాడు మంచి చురుకైన వాడు. మిగిలిన సినిమా తాను పూర్తి చేస్తాడు” అంటూ ఈ సినిమాని దాసరికీ, దాసరిని ఎన్టీఆర్ కీ అప్పగించి వెళ్లిపోయారు భీమ్ సింగ్.
దర్శకుడి మార్పు కాంతారావుకి బొత్తిగా నచ్చలేదు. సహాయ దర్శకుడు దర్శకుడైపోవడం ఏమిటి? అన్నది ఆయన సందేహం. ప్రతీ రోజూ.. ముందుగా ఎన్టీఆర్ కి సంబంధించిన షాట్లు చక చక పూర్తి చేసి, ఆయన్ని మరో సినిమా షూటింగ్ కి పంపించేస్తుండేవారు దాసరి. ”మాకూ పనులుంటాయి కదా. మమ్మల్నీ ముందే పంపొచ్చు కదా..” అని కాంతారావు అలిగేవారు. ఓరోజు.. దాసరి కాంతారావు పక్కన కుర్చిని సన్నివేశం వివరిస్తుండగా.. ఏదో విషయంలో కాంతారావుకి దాసరిపై కోపం వచ్చింది. దాసరి కుర్చున్న కుర్చీని ఫెడేల్ మని తన్ని ”ఈ సినిమాకి నువ్వు దర్శకుడివి కాదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు” అంటూ రుసరుసలాడారు. ఈ ఘటన దూరం నుంచి ఎన్టీఆర్ గమనిస్తూనే ఉన్నారు.
జరిగిన అవమానానికి దాసరి మొహం చిన్నదైపోయింది. ఇంతలో ఎన్టీఆర్ పిలిచి.. ”ఇలాంటి అవమానాలు ఇక్కడ మామూలే. అవమానాలు దిగమింగుకున్నవాళ్లే గొప్పవాళ్లు అవుతారు. మీరు తప్పకుండా గొప్ప దర్శకుడు అవుతారు. అప్పుడు కూడా కాంతారావు గారిని మర్చిపోకండి. ఆయనకు అవకాశాలు లేకపోతే.. పిలిచి మరీ మీరు సినిమాలు తీయండి” అని చెప్పి వెళ్లిపోయారు. ఈ మాటలు కాంతారావుకి వినిపించేలా.
‘అన్న’మాట నిజమైంది. దాసరి కొద్ది కాలంలోనే పెద్ద దర్శకుడు అయిపోయారు. ఆయన కూడా ఎన్టీఆర్ మాటల్ని మర్చిపోలేదు. తన ప్రతీ సినిమాలోనూ కాంతారావుకి ఓ పాత్ర ఉండేలా చూసుకునేవారు. ఒకప్పుడు కాంతారావు తనని అవమానించి ఉండొచ్చు. కానీ… దాన్ని మనసులో పెట్టుకోవడం విధేయత కాదన్నది దాసరి నమ్మిన సిద్ధాంతం. ఎన్టీఆర్ చెప్పిన హితవు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో దాసరి పాత్రికేయులతో పంచుకున్నారు కూడా.