చిత్రసీమలో ఏకస్వామ్యం గురించో, ఆధిపత్య ధోరణి గురించో, గ్రూపిజం గురించో అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అది ఎడతెగని టాపిక్. తరాలు మారినా – ఈ టాపిక్ మాత్రం మారలేదు. అయితే.. అవసరమైనప్పుడల్లా చిత్రసీమ ఒక్కటై కదిలింది. తుపాను బాధితుల కోసం, విరాళాలు సేకరించడం కోసం, ఆఖరికి కరోనాపై పోరాటం కోసం చిత్రసీమంతా ఏకమైన క్షణాలు ఎవ్వరూ మర్చిపోకూడదు.. మర్చిపోరు కూడా. కాకపోతే ఓ వ్యక్తిని, అతని ఆశయాన్ని, ఒకరి కలని కాపాడడానికి పరిశ్రమ మొత్తం ఏకం అవ్వడం – బహుశా ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి కావొచ్చు. విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇప్పుడు చిత్రసీమ ఏకతాటిపై వచ్చింది. చేయీ చేయీ కలిపింది. క్లిష్టమైన తరుణంలో ఐక్యత చూపించింది.
ఓ గాసిప్ వెబ్ సైట్ పై పోరాటం కోసం ఇండ్రస్ట్రీ అంతా కలిది రావడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. కాకపోతే.. ఇది ఇప్పుడు ఈ ఐక్యత అత్యవసరం. ఎందుకంటే ఇది ఓ వెబ్ సైట్ పై మాత్రమే యుద్ధం కాదు. తమకెదురుగా వస్తున్న అన్ని సమస్యలపైనా అనుకోవాలి. చిత్రసీమదంతా పైన పటారం, లోన లొటారం వ్యవహారం. పైకి నిబ్బరంగా కనిపిస్తున్నా, చిన్న గాలికే కూలిపోయే పేక మేడ. ఎవరి కెరీర్ ఎంత కాలమో తెలీదు. స్టార్ డమ్ మెరుపులు ఎన్ని రోజులో ఎవరూ అంచనా వేయలేరు. నిన్నటి చక్రవర్తి.. ఈరోజు బికారి. రోజులే తేడా. వీటన్నింటినీ ఎదురొడ్డి, తమ కెరీర్లను నిర్మించుకోవాలి. విమర్శల్ని కూడా చిరు నవ్వుతో స్వీకరించాలి. అయితే.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది కదా? లోపలున్న సమస్యలకంటే, బయట ఉన్న వ్యవస్థలపై పోరాటం చేయడమే ఎక్కువైపోయింది. వాటిలో ఈ గాసిప్పు వెబ్ సైట్లు ఒకటి. ప్రకటనల కోసమో, సొంత ఎజెండాల కోసమో.. సినిమాని, అందులో పనిచేస్తున్న వాళ్లనీ లక్ష్యంగా చేసుకుని, రాసే రాతలతో వెబ్ సైట్లు కంపు కొట్టడం మొదలెట్టాయి. యూట్యూబ్ ఛానళ్లది మరో రకమైన హింస. వీటిపై ఎప్పటి నుంచో ఉక్కుపాదం మోపాలని గట్టిగా అనుకుంటూనే ఉంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? తుపాకీ గుండుకి ఎదురెళ్లి నిలబడేదెవరు? ఇండ్రస్ట్రీలో చాలామంది దర్శకులు, నటులు, నిర్మాతలూ.. ఆ గాసిప్ వెబ్ సైట్ బాధితులే. కానీ.. ఒక్కరంటే ఒక్కరూ నోరు మెదపలేదు. అక్షరాలతో, తప్పుడు రాతలతో కుళ్లబొడుస్తుంటే మౌనంగా భరించారు, సహించారు. కానీ..విజయ్ దేవరకొండ మాత్రం ప్రతిఘటించాడు. ఎదురెళ్లాడు. తన ప్రశ్నలతో తాట తీశాడు.
అదే చిత్రసీమకు నచ్చింది. తాము చేయలేని పని.. విజయ్ చేస్తుంటే – కనీసం వెనుక ఉండి అండనివ్వడం తక్షణ కర్తవ్యం అని భావించింది. ఈ గాసిప్ వెబ్ సైట్ బాధితులు కాస్త గట్టిగానే విజయ్‌కి సపోర్ట్ చేస్తుంటే.. మిగిలినవాళ్లు `రేపు మన పరిస్థితీ ఇంతేనేమో` అని మేల్కొని.. భుజం కలుపుతున్నారు.
చిరంజీవి నుంచి చిన్నా చితకా నటుడు వరకూ అందరూ విజయ్ వెనుక నిలబడ్డారు. ఇప్పుడు ఇండ్రస్ట్రీ అంతా ఒకటి.. తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్ మాత్రం ఒకటి. పరిశ్రమ ఇలాంటి సంఘీభావాన్నే కోరుకుంటోంది. తమలో ఒకడు పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతుంటే.. చేయూత నివ్వడం చూడాలనుకుంటోంది. విజయ్ ఇప్పుడు బాధితుడు కాదు. అందరినీ కలుపుకొచ్చిన ఓ సారధి. ఈ ఐకమత్యం మిగిలిన అన్ని విషయాల్లోనూ పరిశ్రమ చూపించగలిగితే.. ఏక స్వామ్యం, గ్రూపు రాజకీయాలు అనే నిందని అతి త్వరగా చెరుపుకునే అవకాశం ఉంది.
ఉపసంహరణ: పత్రికలమీద, జర్నలిస్టులపైనా.. ఇలా నోరేసుకుని పడిపోయినప్పుడు జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు, గ్రూపులు, బ్యాచులూ.. తమ పాత్రికేయుడినో, సదరు పత్రికనో, వెబ్ సైట్ నో.. సమర్థిస్తూ మాట్లాడడం, స్వేచ్ఛని హరించే హక్కు మీకెవర్వరు ఇచ్చారు? అంటూ నిలదీయడం సహజం. కానీ ఈ విషయంలో మాత్రమే.. ఏ జర్నలిస్టూ ఇప్పటి వరకూ ఆ వెబ్ సైట్ వెనుక, ఆ పెద్దాయన వెనుక నిలబడలేకపోయారు. ఈ మార్పు మాత్రం.. అందరినీ ఆశ్చర్యంలో పడేసేదే.