మద్యం షాపుల ముందు అలా కిలోమీటర్ల కొద్దీ మందుబాబులు నిలబడి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం మరోసారి తిరిగి చూసింది. అయితే.. ఈ కోణంలో తిరిగి చూడటం వైసీపీ నేతలకు కూడా నచ్చినట్లుగా లేదు. అందుకే.. వాళ్లందరూ.,. కొత్త ధీయరీ ఎంచుకున్నారు. మద్యం షాపుల ముందు అలా క్యూల్లో నిలబెట్టింది టీడీపీ నేతలేనని.. డబ్బులిచ్చి మరీ ఆ పని చేశారని.. మంత్రి పేర్ని నాని నేరుగా .. మొహమాటం లేకుండా మాస్క్ కూడా లేకుండా ప్రెస్‌మీట్ పెట్టి .. మరీ ఆరోపించారు. అంతటితో సరి పెట్టలేదు.. నరేంద్రమోడీపైనా పేర్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ షాపులు తీయమన్నది మోడీనేనని ఆయనపై నెట్టేశారు. అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకువిమర్శిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
నిజానికి లిక్కర్ షాపుల ముందు కిలోమీటర్ల కొద్ది నిలబడి క్యూల్లో నిలబడిన వారందర్నీ టీడీపీ నేతలే పంపి ఉంటే.. ఓట్లు వేయించుకునేటప్పుడు అంత మందిని .. టీడీపీ నేతలు పోలింగ్ బూత్‌లకు పంపి ఉంటే.. ఖచ్చితంగా టీడీపీ గెలిచి ఉండేదని సైటెైర్లు వేస్తున్నారు. ప్రజలకు మద్యం అలవాటు చేసి.. వ్యసనంగా మార్చి… మద్యం అలవాటు తగ్గిస్తున్నామన్న ప్రచారంతో.. వారి రక్తం పీలుస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ నేతలు.. ఎప్పటిలాగే చంద్రబాబుపై నెట్టేశారు. వారందరికీ చంద్రబాబే డబ్బులిచ్చి క్యూల్లోకి పంపారని చెప్పడం ప్రారంభించారు. ఏం జరిగినా చంద్రబాబే అనడం.. వైసీపీ నేతల స్ట్రాటజీ. మొన్నటికి మొన్న కరోనా కూడా టీడీపీ వల్లే వ్యాపిస్తోందని మోపిదేవి ఆరోపించారు. ఇప్పుడు మద్యం క్యూ లైన్లకూ టీడీపీనే కారణం అంటున్నారు.
పేర్ని నాని… మద్యం దుకాణాల ప్రారంభోత్సవ తప్పు.. మోడీపైకి నెట్టేశారు. మద్యం దుకాణాలు తెరవన్నమది మోడీనేనని తేల్చేశారు. తెరవమని… మోడీ చెప్పలేదు. తెరుచుకోవచ్చని చాన్సిచ్చారు. అలా చాన్సిచ్చినా.. తెలంగాణ, కేరళ సహా.. అనేక రాష్ట్రాలు మద్యం అమ్మకాలు ప్రారంభించలేదు. ఈ విషయాన్ని పేర్ని నాని గుర్తించలేక కాదు.. తమ తప్పును.. ఎవరి మీదో ఒకరి మీద తోసేయక తప్పని పరిస్థితి వారికి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.