తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు… ప్రజలు సహకరించాలని కోరారు. రాత్రి ఏడు గంటల నుండి ఇప్పుడున్న మాదిరిగానే కర్ఫ్యూ కొనసాగుతుదన్నారు. కరోనా నివారణ చర్యలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయని.. మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో గెలిచే వరకూ.. ప్రజలు సహకరించాలన్నారు. అయితే.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. కేవలం ఆరు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. మిగతా 27 జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు జరుపుకునేందుకు సడలింపులు ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మినహాయింపులుప్రకటించారు. మండల కేంద్రాల్లో మాత్రం.. సాయంత్రం ఆరు గంటల వరకు కార్యకలాపాలు నిర్వహించారు. అన్నిరకాల దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖ కూడా బుధవారం నుంచి పని చేస్తుందని.. భూముల అమ్మకాలు, కొనుగోళ్లను ప్రారంభించవచ్చని కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల దుకాణాలను ప్రారంభించుకోవచ్చన్నారు. మిగిలిపోయిన పదోతరగతి పరీక్షల్ని కూడా నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఒక్క రూమ్లో ఇరవై మంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని.. ఎవర్ని ఎవరూ కాపాడరని స్పష్టం చేశారు. జబ్బులు ఉన్న వారు.. దీర్ఘ కాలిక రోగాలకు చికిత్స తీసుకుంటున్న వారు బయటకు రాకపోతేనే మంచిదన్నారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో తెలంగాణ మెరుగైన స్థానంలో కేసీఆర్ ప్రకటించారు. రికవరీ రేటు.. దేశం సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. దేశంలో మెదటి కంటెయిన్మెంట్ జోన్.. కరీంనగర్ అని.. అక్కడ చాలా త్వరగా కరోనా వైరస్ను కట్టడి చేశామని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.