తెలంగాణ సర్కార్ కూడా మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. రెడ్ జోన్ జిల్లాల్లో ఇతర వ్యాపారాలకు అనుమతి ఇవ్వని తెలంగాణ సర్కార్ మద్యం దుకాణాలు మాత్రం తెరుచుకోవచ్చని ప్రకటించేసింది. అయితే.. తెలంగాణ సర్కార్ మందుబాబుల పట్ల.. కాస్తంత కనికరం చూపించింది. ఏపీలో మద్యం తాగేవారిని తగ్గిస్తామంటూ… దాదాపుగా మద్యం రేట్లను రెండింతలు చేశారు. కానీ.. తెలంగాణలో మాత్రం.. పదహారు శాతం మాత్రమే పెంచారు. అదీ కూడా పేదలు తాగే చీప్ లిక్కర్‌పై మాత్రం పదకొండు శాతమే పెంచారు. ముఖ్యమైన బ్రాండ్లపై మాత్రం పదహారు శాతం పెంచారు. ఏపీలోలా… మద్యం దుకాణాలు ప్రభుత్వం నడపడం లేదు. ప్రైవేటు దుకాణాలు నడుపుతున్నాయి. అక్కడ బ్రాండ్లపై ఆంక్షలు లేవు. మందుబాబులు కావాలనుకున్నది అమ్ముతారు.
మద్యం అమ్మకాల విషయంలో.. నిబంధనలు పాటించేలా చూడాలని.. ప్రభుత్వం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. భౌతిక దూరం పాటించాలని.. తోపులాటలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే.. మందుబాబు..ఈ నిబంధనలు ఎంత మేర పట్టించుకుంటారన్నది ఆసక్తికరం. తెలంగాణలోనూ… మద్యం దుకాణాల వద్ద పెద్ద క్యూలు ఈ రోజు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. మందుబాబుల నుంచి అనూహ్యమైన డిమాండ్ వస్తుందని ముందుగానే అంచనా ఉండటంతో..షాపుల వద్ద..స్టాక్‌ను ప్రభుత్వం వెరిఫై చేయించింది. ఓ దశలో మద్యం ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే అమ్మకాలు చేయాలనుకున్నారు కానీ.. సరిపోతుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మద్యం ఆదాయం వదులుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుకోవడం లేదు. కంప్లీట్ రెడ్ జోన్.. ఆదర్శ భావాలు ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్ పాలన చేస్తున్న ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాల కోసం ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో వందల కేసులు నమోదవుతున్నా.. మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు.అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్నంగా ఏమీ లేదు. అయితే.. అత్యధికంగా రేట్లు పెంచిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. చాలా రాష్ట్రాలు కోవిడ్ ట్యాక్స్‌ను మద్యంపై వేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి.