హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు పత్రికారంగ దిగ్గజం రామోజీరావుకు పద్మవిభూషణ్ ఇవ్వటంపై ప్రముఖ రాజకీయ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు మార్గదర్శి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పద్మవిభూషణ్ ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. మార్గదర్శి ఫైనాన్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని రామోజీపై ఆరోపణలు ఉన్నాయని, వాటినుంచి ఇంకా బయటపడలేదని గుర్తు చేశారు. 1996లోనే పురాతన విగ్రహాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయని, ఆ కేసు కూడా ఇంకా ముగియలేదని చెప్పారు. జర్నలిజం, సాహిత్యం, విద్య రంగాలలో చేసిన కృషికి గానూ చంద్రబాబు ప్రభుత్వం ఆయన పేరును సిఫార్సు చేసిందని తెలిపారు. అయితే రామోజీరావు ఫ్యాన్సీగా ఛీఫ్ ఎడిటర్ అని పేరు వేసుకుంటారుగానీ, ఆయనకు వంద పదాలతో ఒక వ్యాసంకూడా రాయలేరని అందరకూ తెలుసని చెప్పారు. సాహిత్యంలో కూడా ఆయన ఒక్క పుస్తకం కూడా రాయలేదని అన్నారు. విద్యకు సంబంధిస్తే భార్య రమాదేవి పేరుతో ఒక ప్రైవేట్ పాఠశాలను మాత్రమే నడుపుతున్నారని చెప్పారు. ఆయన వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త మాత్రమేనని ఉండవల్లి అన్నారు.
ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పద్మవిభూషణ్ వంటి ఉన్నతస్థాయి పురస్కారం ఇచ్చేటపుడు ప్రభుత్వాలు ఆలోచించి ఉండాల్సిందని చెప్పారు. ఇంత మచ్చ ఉన్న వ్యక్తికి ఉన్నతస్థాయి పురస్కారం ఇవ్వటంద్వారా సమాజానికి ఏమిచెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆయనకు అవార్డ్ ఇవ్వమని సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, అవార్డ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మీడియాద్వారా ఈ ప్రశ్న అడుగుతున్నట్లు ఉండవల్లి తెలిపారు.