ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఈ లోపు ఆమె చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులను …అమలు చేయకపోగా.. ధిక్కరించేలా నిర్ణయాలు తీసుకోవడం.. జీవోలు విడుదల చేయడమే దీనికి కారణమంటున్నారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేశారు. వాటిని తీసేయాలని హైకోర్టు,సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. అయితే.. చీఫ్ సెక్రటరీ మాత్రం.. ఆ రంగులు అలాగే ఉంచి.. మరో కొద్దిగా మరో రంగు వేయాలని ఆదేశాలిచ్చారు. ఉన్న రంగులకు.. కొత్త కొత్త అర్థాలు చెప్పారు. దీనిపై హైకోర్టులో.. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్న పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు కూడా అదే రీతిలో అభిప్రాయం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశించింది.
ఒక్క రంగుల విషయంలోనే కాదు.. ఇటీవలి కాలంలో హైకోర్టు ఇచ్చిన అనేక ఆదేశాలను దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. వాటిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయినప్పటికీ.. ప్రభుత్వ అధికారులు రాజధాని భూముల్లో ప్లాటింగ్ చేశాలు. లాక్ డౌన్ సమయంలో ఇలా చేయడంపై హైకోర్టులో రైతులు పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇక ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీనికి సొంత భాష్యం చెప్పుకున్న ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అఫిడవిట్లు తీసుకున్నారు.
గతంలో రాజధాని కార్యాలయాలను తరలించే విషయంలోనూ కోర్టు ధిక్కరణ పిటిషన్లు పడ్డాయి. కోర్టులను.. ఏపీ అధికారయంత్రాగం గౌరవించడం లేదన్న అభిప్రాయాలు ఈ కారణంగానే వినిపిస్తున్నాయి. కోర్టు ధిక్కరణ నిర్ణయాలు తీసుకుంటే.. ముందుగా ఇబ్బంది పడేది అధికారయంత్రామే. చీఫ్ సెక్రటరీనే. కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహాని..చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే తక్కువ పదవీ కాలం ఉన్నప్పటికీ.. ఏపీసీఎస్గా వచ్చి చేరారు. అయితే.. ఆమె కన్నా ఎక్కువగా సీఎం పేషిలో ఉన్న అధికారులే ఎక్కువ పనులు చక్క బెడుతున్నారని అంటున్నారు. ఆమె పాత్ర నామమాత్రమైనా.. ఆ పేరు మీదే వ్యవహారాలు సాగుతూండంతో రిటైర్మెంట్ కు ముందు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది.