తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించి ప్రెస్మీట్లో.. చెప్పాల్సినదంతా చెప్పిన తర్వాత విపక్ష నేతలపై తన లాంగ్వేజ్‌లో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు దిక్కుమాలిన సన్నాసులని ఈసడించారు. వైరస్‌ను దాస్తున్నామంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ఏమిటని.. ఎవరైనా మరణాలు లేవని ఫిర్యాదు చేస్తారా..అని ప్రశ్నించారు. దిక్కుమాలిన పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వడం సమయం దండగని తేల్చేశారు. కేసీఆర్ మాటలు ప్రతిపక్ష పార్టీల నేతలను సూటిగా తాకాయి. వారు కూడా అదే రేంజ్లో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుగుల్బాజీ మాటలు వినలేదని..పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట్లాడలేదన్నారు.
అసెంబ్లీలో కరోనా పారాసిటమాల్‌తో తగ్గుతుందని చెప్పారని.. ఆయనను బపూన్ అనాలా.. దద్దమ్మ అనాలా అని ప్రశ్నించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. ఆయనను కలవాలని తామేమీ తాపత్రయపడలేదన్నారు. కేసీఆర్ ఫెయిలయ్యారు కాబట్టే.. తాము గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా కేసీఆరే అతి పెద్ద బఫూన్ అంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రతిపక్షాలపై సీఎం వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. రైతులకు గన్ని బ్యాగులు అందించలేని అతి పెద్ద దద్దమ్మ కేసీఆర్ అంటూ మల్లు విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్‌పై కాస్త సాఫ్ట్‌గా మాట్లాడే జగ్గారెడ్డి కూడా.. మండిపడ్డారు. రైతుల సమస్యను పరిష్కరించమని కోరితే.. సన్నాసుల్లా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.
తెలంగాణ విపక్షాలు గత వారం రోజులుగా కలసి కట్టుగా పోరాటం చేస్తున్నాయి. రైతుల సమస్యలపై అందరూ కలిసి.. గవర్నర్ ను కలిశారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతున్నారు. అందరూ వేర్వేరుగా అయినప్పటికీ దీక్షలు చేశారు. ఇది కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. అందుకే ప్రెస్మీట్లో ఆయన విపక్ష పార్టీలుపై విరుచుకుపడ్డారు. అయితే. .ఆయన తనదైన లాంగ్వేజ్‌తో ఆ విమర్శలు చేయడం .. విపక్ష నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ వార్ ఆఫ్ వర్డ్స్‌తో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.