బాలసుబ్రహ్మణ్యం.. దర్శకుడు భాగ్యరాజా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు. సినిమాల్లోకి రాక ముందు నుంచీ. ‘ఏరా…’ అంటే ‘.. ఏరా..’ అని పిలుచుకునేంత చనువు వుంది.
భాగ్యరాజా సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేసేవారు. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ తానే. ఆ నాటకాల్లో నేపథ్య గానాలు, పద్యాలూ ఏమైనా ఉంటే.. వాటి సంగతి చూసుకోవడం బాలు పని. ఫ్లూటు కూడా వాయించేవారు. భాగ్యరాజాతో పోలిస్తే.. బాలు ఆర్థిక పరిస్థితి కాస్త బాగుండేది. ఎప్పుడూ రంగు రంగుల చొక్కాలతో ముస్తాబై నాటకాలకు వస్తుండేవారు. ఓరోజు సరికొత్త సిల్కు జుబ్బా వేసుకొచ్చారు బాలు. అది భాగ్యరాజాకి బాగా నచ్చేసింది.
“ఒరేయ్.. స్టేజీ ముందు ఉండాల్సినవాడ్ని నేను. నువ్వు వెనుక ఉండి పాడితే సరిపోతుంది. ఆ చొక్కా నాకు ఇవ్వరా.. నాటకం అయిపోయిన వెంటనే ఇచ్చేస్తా..” అని అభ్యర్థించారు భాగ్యరాజా.
కానీ కొత్త చొక్కా. ఇవ్వడానికి బాలుకి మనసొప్పలేదు. ఏవోవే కొంటె సాకులు చెప్పడం ప్రారంభించారు. కానీ భాగ్యరాజా వినలేదు. “ప్లీజ్ రా.. చొక్కా ఏమాత్రం నలపకుండా.. నీకు తిరిగి ఇచ్చేస్తా.. ఉతికిస్తా.. ఇస్త్రీ చేసిస్తా..” అంటూ ప్రాధేయపడడంతో…బాలుకి చొక్కా ఇవ్వడం తప్పలేదు. బాలు చొక్కా భాగ్యరాజా, భాగ్యరాజా చొక్కా బాలూ వేసుకున్నారు.
నాటకం ప్రారంభమైంది. భాగ్యరాజా ఇన్వాల్వ్ అయి మరీ నటిస్తున్నారు. అది ఎమోషనల్ సీన్. అందులో భాగ్యరాజా మరింత విజృంభిస్తున్నాడు. గుండెలు బాదుకుంటూ డైలాగ్ చెప్పాలి. భాగ్యరాజా లీనమైపోయాడు. గుండెలు బాదుకున్నాడు. ఆ ఆవేశంలో.. చొక్కా కూడా చింపేశాడు. ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు, గోల.. గోల.
కానీ నాటకం చూస్తున్న బాలు గుండె గుభేల్ మంది. ఎందుకంటే ఆ చొక్కా తనది. కొత్త చొక్కా..ని పీలికలు పీలికలుగా చించేసిన భాగ్యరాజాని చూసి, నవ్వాలో, ఏడవాలో, తన ప్రతిభని చూసి మెచ్చుకోవాలో, తన చొక్కాని చింపేసినందుకు నొచ్చుకోవాలో అర్థం కాలేదు. స్టేజీ దిగిన భాగ్యరాజా. “సారీరా.. సీన్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను..చొక్కా చించుకోవడం డైలాగ్ పేపర్ లో లేదు.కానీ.. అలా జరిగిపోయింది.రేపటి కల్లా కొత్త చొక్కా నీకు కొని ఇచ్చేస్తా… ప్రామిస్” అంటూ వేడుకున్నాడు భాగ్యరాజా. చేసేదేం లేక.. సరే అంటూ… మన్నించేశాడు. ఆ చొక్కా ఇప్పటి వరకూ కొని ఇవ్వలేదట భాగ్యరాజా. ఓ సందర్భంలో బాలు.. ఉద్వేగభరితంగా ఆనాటి తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.