ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలకు జరపాలని కేంద్రమే ఆదేశించిందని.. తమను ఎందుకు విమర్శిస్తున్నారని వైసీపీ నేతలు.. నిన్నటి నుంచి .. విపక్ష పార్టీపై రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. పేర్ని నాని నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరును ప్రస్తావించి మరీ చెప్పారు. ఈ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. కేంద్ర ప్రభుత్వమే ఓపెన్ చేయమని చెప్పిందని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం లేదని రాష్ట్రాలన్నీ కేంద్రంపై ఒత్తిడి చేస్తే వైన్ షాపులు తెరుచుకోవాలని మాత్రమే కేంద్రం చెప్పిందని.. తెరుచుకోవడానికి.. మూసివేసి ఉంచడానికి నిర్ణయం మొత్తం రాష్ట్రాలదేనని జీవీఎల్ స్పష్టం చేశారు.
కేంద్రం తెరవాలని ఆదేశిస్తే.. కొన్ని రాష్ట్రాలు ఎందుకు ఇంకా తెరవలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్రంపై రుద్దడం సరి కాదని మండిపడ్డారు. 75 శాతం ధరలు పెంచి అమ్మాలనే నిర్ణయం రాష్ట్రానిది కాదా అని ప్రశ్నించారు. మధ్యనిషేధం అంటున్న వైసీపీ మళ్లీ వైన్ షాపులు ఎందుకు తెరిచిందని.. మద్యనిషేధానికి ఇంత కన్నా మంచి సమయం మళ్లీ దొరకదనే విషయం తెలియదా అని జీవీఎల్ మండిపడ్డారు. ఇటీవలి కాలంలో జీవీఎల్ ఏపీ రాజకీయాల్లో భిన్నమైన పంధాను అవలంభిస్తున్నారు. వైసీపీ నేతలు.. బీజేపీని ఎంత టార్గెట్ చేసినా.. ఒక్క మాట కూడా స్పందించడం లేదు.
విజయసాయిరెడ్డి లాంటి నేతలు బీజేపీ అంతర్గత విషయాలపై ఆరోపణలు చేసినా జీవీఎల్ సైలెంట్ గానే ఉన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తే.. ఆయన టీడీపీపైనే రివర్స్‌లో విమర్శలు చేస్తూ ఉంటారు. దాంతో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వచ్చాయి. ఇప్పుడు కూడా.. ఆయన తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీని మాత్రమే టార్గెట్ చేయలేదు. టీడీపీని కూడా కలిపేసి.. జనరలైజ్ చేసేశారు. టీడీపీ, వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని తేల్చేశారు.