ఓ వైపు ఎస్ఈసీ తొలగింపు… కొత్త ఎస్ఈసీ నియామకం వ్యవహారంపై కోర్టులో కేసులు.. రంగుల తొలగించే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దన్న హైకోర్టు ఆదేశాలు.. మరో వైపు లాక్ డౌన్ పొడిగింపు వంటి కారణాలతో.. ఏపీ స్థానిక ఎన్నికలు .. నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎప్పటి వరకు వాయిదా అన్నదానిపై ఎస్ఈసీ కనగరాజ్ స్పష్టత ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎన్నికల వాయిదా కొనసాగుతుందని ఆయన పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో కరోనా కారణంగా ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ అప్పటి ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఆరు వారాలు.. గత నెల 30వ తేదీతో అయిపోయాయి. పరిస్థితిని సమీక్షించి.. ఎన్నికల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. కానీ.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కనగరాజ్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయాయో.. అక్కడ్నుంచే తర్వాత ప్రారంభమవుతాయని.. ఉత్తర్వుల్లో కనగరాజ్ పేర్కొన్నారు. నిజానికి విషయం హైకోర్టులో ఉంది. ఆయన నియామకంపైనే .. పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే కనగరాజ్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.
నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వకూడదని.. వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది లేదన్న వాదన ప్రభుత్వ తరపున న్యాయవాదవర్గాలు వినిపిస్తున్నాయి. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని మరికొందరు వాదిస్తున్నారు. గురువారం.. ఎస్ఈసీ ఆర్డినెన్స్ వ్యవహారంపై ప్రభుత్వం తరపున కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.