అగ్ర దర్శకులు సైతం వెబ్ సిరీస్‌లపై దృష్టి నిలుపుతున్న కాలం ఇది. వాటికున్న ఆదరణ అలాంటిది. సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. దాంతో… స్టార్ దర్శకులు అటువైపు దృష్టి పెడుతున్నారు. సీరియర్ దర్శకుడు వంశీ కూడా వెబ్ సిరీస్‌తో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఆయన జీవితంలోని విశేషాలన్నీ `పొలమారిన జ్ఞాపకాలు` రూపంలో రాస్తున్న సంగతి తెలిసిందే. స్వాతి వార పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసాలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ఈ కథలన్నీ పుస్తకం రూపంలో రాబోతున్నాయి. అంతకంటే ముందు.. వీటిలో కొన్ని ఎపిసోడ్లు వెబ్ సిరీస్ రూపంలో ప్రసారం కానున్నాయని తెలుస్తోంది. ఓ ఓటీటీ సంస్థ వంశీని సంప్రదించి, పొలమారిన జ్ఞాపకాల్ని వెబ్ సిరీస్‌గా రూపొందించాలని, దానికయ్యే ఖర్చు భరిస్తామని చెప్పిందట. ప్రస్తుతం ఆ పనుల్ని మొదలెట్టారు వంశీ. నిజానికి వంశీ చేతిలో ఓ సినిమా ఉంది. లాక్ డౌన్ ఎత్తేశాక ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్దామన్నది వంశీ ప్లాన్. ఈలోగా ఈ ఆఫర్ వచ్చింది. మరి వంశీ అడుగు ఎటువైపో..?