ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. సమస్యల వారీగా .. అధికారులు ఎప్పటికప్పుడు స్పందించేలా.. వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రతి జిల్లాకు మూడో జాయింట్ కలెక్టర్‌ను… కేటాయించారు. ఇప్పటికిఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అదనంగా మరో పదమూడు జాయింట్ కలెక్టర్ పోస్టులు మంజూరు చేశారు. ఈ మూడో జాయింట్ కలెక్టర్ రైతుల సమస్యలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో కూడాప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది. చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.
అందుకే.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ వ్యవస్థలోనూ సంస్కరణలు తీసుకు వచ్చారు. మొదటి జాయింట్ కలెక్టర్ కు రైతు భరోసా, రెవెన్యూ బాధ్యతలు ఇస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించే జేసీ పదవిని కొత్తగా సృష్టించారు. సీనియర్ టైమ్ స్కేల్ ఐఏఎస్ అధికారితోనే భర్తీ చేస్తారు. మూడో జేసీ ఆసరా పథకాన్ని పర్యవేక్షిస్తారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారిని నియమిస్తారు. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు.. జగన్మోహన్ రెడ్డి.. వ్యవస్థల్ని మారుస్తున్నారు.
ప్రజల వద్దకు పాలన అనేది మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే కొంత విజయం సాధించారు. రైతుల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్‌ను నియమించడం ద్వారా మెరుగైన ఫలితాల్ని సాధించగలమని భావిస్తున్నారు.