ఉత్తరాంధ్రలో కరోనా ప్రభావం పెద్దగా లేదని రిలీఫ్ ఫీలవుతున్న సమయంలో… అక్కడ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో… ఒక్క రోజే మూడు కేసులు వెలుగు చూశాయి. దాంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ.. కోవిడ్ 19 కేసులు నమోదయినట్లయింది. నిన్న ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అనుకున్నారు. కానీ అధికారిక ప్రకటనలో మూడు పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా ప్రకటించారు. విశాఖపట్నంలో కొత్తగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ జిల్లాలో మొత్తం 46 కేసులు నమోదయినట్లు అయింది.
మొన్నటిదాకా… సింగిల్ డిజిట్‌లోనే యాక్టివ్ కేసులుఉన్నాయి. ఇప్పుడు యాక్టివ్ కేసులు 24కి చేరాయి. శ్రీకాకుళం జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న మరో 56 పెరిగాయి. ఎనిమిదివేలకుపైగా జరిపిన టెస్టుల్లో… 56 పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా అధికారులు ప్రకటించారు. వీటితో కలిపి మొత్తం 1833 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 38 మంది చనిపోయారు.
మరో 780 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 1015గా ఉన్నాయి. నిన్న అత్యధికం.. గుంటూరు, కడప జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా టెస్టులు చేస్తూండం వల్ల కేసులు పెరుగుతున్నాయని.. అధికారులు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలుతున్నారని అంటున్నారు.