విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో గ్యాస్ లీక్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. కోటి పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున అందిస్తారు. అధికారిక ప్రకటన ప్రకారం ఇప్పటి వరకూ తొమ్మిది మంది చనిపోయారు. అలాగే.. ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ. పది లక్షలు, రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో ఉన్న వారికి రూ. లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. పాతిక వేలు, ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రతీ కుటుంబానికి రూ. పదివేలు చొప్పున సాయం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చేదానితో సంబంధం లేకుండా.. కంపెనీ నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎల్జీ పాలిమర్స్ ఓ అంతర్జాతీయ సంస్థ అని .. అలాంటి సంస్థలో ఇలాంటి దుర్ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోందని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలన్నదానిపై కమిటీని నియమించామని ప్రకటించారు. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే.. ఎల్జీ పాలిమర్స్ సంస్థ విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఘటన జరిగిన వెంటనే.. అధికారులు స్పందించి.. అందర్నీ అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారని.. అభినందించారు. ఘటన విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖ పర్యటనకు వచ్చారు. కేజీహెచ్‌లో బాధితుల్ని పరామర్శించారు.
మరో వైపు.. పరిశ్రమను తెరవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారన్న అంశం వివాదాస్పదమవుతోంది. అత్యవసరమైన పరిశ్రమలకు తెరవడానికే పర్మిషన్ ఇచ్చారని.. ఎల్జీ పాలిమర్స్‌లో ప్లాస్టిక్ వస్తవులు తయారు చేస్తారని అంటున్నారు. తానే ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఓ నేతనే.. అనుమతులు ఇప్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో స్పష్టంగా చెప్పలేదు కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం… ఎవర్నీ వదిలి పెట్టబోమని ట్విట్టర్లో హెచ్చరించారు. యాజమాన్యంపై కేసుపెట్టామని మంత్రి గౌతంరెడ్డి ప్రకటించారు.