విశాఖలో గ్యాస్ లీక్ అనంతర పరిస్థితుల్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీల్ చేస్తోంది. స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ డీజీ ప్రధాన్.. రెస్క్యూ ఆపరేషన్ ను ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి పుణె నుంచి ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను విశాఖకు పంపారు. ఆ తర్వాత బాధితుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లడం సహా.. మొత్తం సహాయ కార్యక్రమాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్.. విశాఖలో పరిస్థితుల్ని.. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి వివరించారు. పదకొండు మంది చనిపోయారని.. గ్యాస్ పీల్చిన అనేక మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందని ప్రధాన్ ప్రకటించారు. 25 నుంచి 30 మంది పరిస్థితి ఆందోలన కరంగా ఉందని ప్రకటించారు. అలాగే.. 80 మందికిపైగా వెంటిలేటర్లపై ఉన్నారన్నారు. రెండు వందల మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినట్లుగా ప్రకటించారు.
మరో వైపు… ఈ గ్యాస్ లీక్ ప్రమాదం విశాఖ పట్టణాన్ని షాక్ గురి చేసింది. కొన్ని రోజులుగా ఏదో ఓ విపత్తు చుట్టుముడుతూండటమే దీనికి కారమం. ప్రతీ సారి ప్రకృతి ప్రకోపం చూపిస్తూంటే.. ఈ సారి గ్యాస్ రూపంలో ప్రమాదం విరుచుకుపడింది. విశాఖ వాసులు మరోసారి తీవ్రంగా నష్టపోయారు. ఆరేళ్ల కిందట.. హుదూద్ తుపాను విశాఖను దాదాపుగా తుడిచి పెట్టేసింది. సర్వం కోల్పోయినా.. విశాఖ వాసులు మొక్కవోని అత్మవిశ్వాసంతో మళ్లీ నిటారుగా నిలబడ్డారు. తమను ఏ ప్రళయం ఏమీ చేయదని సంకేతాలు ఇచ్చారు. హుదూద్పై విశాఖ సాధించిన విజయాన్ని ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకుంది.
ఇలా వరుసగా ఉపద్రవాలు రావడం .. ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకదాని వెంట ఒకటి.. తట్టుకునేంతలో వస్తున్న కష్టాలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ ప్రమాదం.. ఇప్పటితో ముగిసిపోదని వారు ఆందోళన చెందుతున్నారు. ఓ తుపాను వస్తే.. ఆస్తులు పోతాయి. మళ్లీ సంపాదించుకోవచ్చు. దీర్ఖ కాలిక ప్రభావం ఉండదు. కానీ గ్యాస్ లీకేజీ వల్ల.. ఆ గాలి పీల్చుకున్న వారు జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుందన్న ఆందోళన.. వైజాగ్ వాసుల్ని పట్టి పీడిస్తోంది. అందుకే… విష వాయువు బారిన పడిన వారికి వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.