తన యాగాల వల్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధికారం దక్కిందని ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రకటించుకునే స్వరూపానంద స్వామి.. కొద్ది రోజుల కిందట.. కరోనా అంతం అయ్యే తేదీని ప్రకటించారు. ప్రపంచాన్ని కాలసర్పదోషం వెంటాడుతోందని గుర్తించి.. మే 5 నాటికి పరిస్థితి అదుపులోకి వస్తుందని తనకున్న అపార పరిజ్ఞానంతో జోస్యం చెప్పారు. కరోనా ప్రమాదమే అయినా దేవుడి కృపతో ప్రభావం తగ్గుతుందని తనను నమ్మే భక్తులకు భరోసా ఇచ్చారు. జోతిష్య శాస్త్ర ప్రకారం కరోనా ఏళ్ల తరబడి ఉండదని … కరోనా కారణంగా దేశానికి అంతగా చేటు జరగదని చెప్పుకొచ్చారు.
ఉగాది పంచాంగంలోనూ… స్వరూపానంద ఇదే సెలవిచ్చారు. మే ఐదో తేదీ అయిపోయి మూడు రోజులవుతోంది. కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోగా.. పెరుగుతోంది. పైగా.. ఇక కరోనాతో జీవించాల్సిందేనని.. తాను యాగాలు చేస్తే ముఖ్యమంత్రులు అయినట్లుగా చెప్పుకునే.. తెలుగు రాష్ట్రాల సీఎంలూ చెబుతున్నారు. దీంతో.. ఆయన ప్రకటనలను బయటకు తీసిన నెటిజన్లు.. స్వరూపానంద ఇప్పుడేం చెబుతారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో లాక్ డౌన్లు ప్రకటించినప్పుడు.. ఆయా తేదీలను బట్టి.. అప్పటికి తగ్గిపోతుందని అంచనా వేసుకుని తన .. జోస్యం నిజమవుతందన్నట్లుగా ప్రకటనుల చేశారు.
ఆయన ప్రకటనలు చూసిన చాలా మంది అప్పుడే.. కరోనా వైరస్ ను ఆపేందుకు ఎందుకు యజ్ఞాలు చేయడం లేదని కొంత మంది ప్రశ్నించారు. వాటిపై ఎలాంటి రియాక్షన్ లేదు. అందుకే.. నెటిజన్లు ఇప్పుడు.. స్వరూపానందను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. అయితే.. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే స్వరూపానంద అంతే దూకుడుగా ఉంటారు. మహా యజ్ఞం చేయాల్సి ఉంటుందని సెలవిచ్చి.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో చేసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.