ఆరెంజ్ జోన్లో ఉన్న విశాఖ జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా పదకొండు కేసులు నమోదయ్యాయి. దాంతో విశాఖలో మొత్తం 33 యాక్టివ్ కేసులు ఉన్నట్లయింది. సాధారణంగా 20 కన్నా ఎక్కువ కేసులు నమోదైతే రెడ్ జోన్ జిల్లాగా పరిగణిస్తారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత విశాఖలో మొత్తం 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 మంది డిశ్చార్జయ్యారు. ఒకరు చనిపోయారు. మరో 33 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగైదు రోజులుగా.. విశాఖలో వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
గత వారం.. విశాఖలో యాక్టివ్ కేసులు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు 33కి చేరాయి. మొదట్లో 20 పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత విశాఖ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దాంతో కేసులు ఆగిపోయాయి. అనూహ్యంగా 40 రోజుల లాక్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. అంతకు ముందు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసుల లేవు. కానీ ఇప్పుడు.. ఆ రెండు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విజయనగరం జిల్లాలో ఐదు.. శ్రీకాకుళం జిల్లాలో ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజూ.. అత్యధికేసులు నమోదవుతున్న గుంటూరు, కృష్ణా జిల్లాలో మాత్రం గత ఇరవై నాలుగు గంటల్లో తక్కువ కేసులే బయటపడ్డాయి.
గుంటూరులో ఒక్కటే నమోదు కానీ.. కృష్ణా జిల్లాలో ఆరు వెలుగు చూశాయి. అన్ని చోట్లా కాస్త తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నప్పటికీ.. విశాఖలో అనూహ్యంగా పెరుగుతూండటం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. రోజు వచ్చే కేసుల కన్నా డిశ్చార్జ్ అయ్యే వారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1004 మాత్రమే ఉన్నాయి. మొత్తంగా చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది.