ఎల్జీ పాలిమర్స్ తక్షణం రూ. యాభై కోట్ల పెనాల్టీ చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. స్టైరైన్ లీక్ ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యమే కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఎన్జీటీ.. పూర్తి స్థాయి విచారణకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో పాటు.. కెమికల్ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్‌కు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. పది రోజుల సమయం అంటే మే పద్దెనిమిదో తేదీలోపు రిపోర్ట్ ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. స్టైరైన్ లీక్ వ్యవహారంలో.. కంపెనీ ఎక్కడా నియమ నిబంధనలు పాటించలేదని.. ఎన్జీటీ అభిప్రాయపడింది.
మరో వైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లతో ఓ హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా విచారణ ప్రారంభించింది. గ్యాస్ లీక్ కారణాలపై కమిటీ పరిశీలన జరపనుంది. మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం కమిటీకి నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరిగిందన్నది కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. స్టైరైన్ లీక్ వెనుక ఏ విధంగా చూసినా…పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమే కానీ.. ప్రమాదవశాత్తూ కూడా జరిగింది కాదని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే కోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంపెనీపై కేసులు పెట్టినప్పటికీ.. ముఖ్యమంత్రి ఆ కంపెనీ గురించి సానుకూలంగా మాట్లాడటంతో… చర్యలు తీసుకోరన్న అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సహా.. ఇతర కేంద్ర సంస్థలు మాత్రం.. ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. అన్ని రకాల విచారణలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎల్జీ పాలిమర్స్‌ను మళ్లీ ప్రారభించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. మళ్లీ అక్కడ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం కావడం కష్టమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.