కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాల్ని ప్రారంభించాయి. మద్యం దుకాణాల దగ్గర ఎవరూ.. భౌతిక దూరం..మాస్కులు లాంటివి పెట్టుకోకుండానే… గుంపులు, గుంపులుగా మద్యం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మద్యం అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని.. తక్షణం మద్యం అమ్మకాల్ని నిలిపివేయాలని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు డోర్ డెలివరీ సలహా ఇచ్చింది. భౌతికదూరం అమలు చేసేందుకు డోర్ డెలివరీని పరిశీలించాలని సూచించింది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని.. సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కరోనా వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో నలభై రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. చివరికి కేంద్రం… నలబై రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం అనుమతించిన ఒక్క రోజేనే మెజార్టీ రాష్ట్రాలు అమ్మకాలు ప్రారంభించాయి.
నలభై రోజుల తర్వాత అమ్మకాలు ప్రారంభించడంతో.. మొదటి రోజు.. అందరూ ఎగబడ్డారు కానీ… తర్వాత చాలా చోట్ల మామూలుగానే పరిస్థితి మారింది. వందల మంది ఏమీ దుకాణాల ముందు ఉండటం లేదు. అయితే.. తొలి రోజుల్లో రష్ చూసిన తర్వాత పిటిషనర్లు కోర్టుల్లో కేసు వేసి ఉంటారు. డోర్ డెలివరి సలహా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి… అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల నిర్ణయం.