విశాఖ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ప్రభుత్వం రూ. 30 కోట్లు విడుదల చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను.. కేటాయిస్తూ..జీవో జారీ చేశారు. మరణించినవారి కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని.. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు, మూడురోజులు ఆస్పత్రిలో ఉండి వెళ్లినవారికి రూ.లక్ష, ప్రాథమిక చికిత్స తర్వాత వెళ్లినవారికి రూ.10వేలు అలాగే.. ఐదు గ్రామాల్లోని పదిహేను వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం గురువారం ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు జీవో రిలీజ్ చేశారు. శనివారం…బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.
సీఎం జగన్ శరవేగంగా స్పందించి… విపక్ష పార్టీలు కూడా ఊహించనంత మొత్తం పరిహారాన్ని ప్రకటించారు. అంతే వేగంగా బాధితులకు అందేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరో వైపు విశాఖలో పరిస్థితులు పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు.గ్యాస్ లీకేజ్ నివారణ, వాయువు విష ప్రభావాన్ని తగ్గించడానికి ముంబై, పుణె, నాగపూర్, గుజరాత్ నుంచి ప్రత్యేక రసాయనాలతో… ప్రత్యేక బృందాలు విశాఖకు వచ్చాయి. లీకేజీని అదుపు చేసి..వాయువు విష ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసేందుకు ప్రత్యేక బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. పొల్యూషన్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసేందుకు.. మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.. ట్యాంకర్‌లోని రసాయనం 60శాతం పాలిమరైజ్ అయ్యింది.. మిగిలిన 40శాతం పాలిమరైజ్ అవ్వడానికి ఒక రోజు పట్టే అవకాశం ఉంది.
అసలు పరిశ్రమ ప్రారంభించడానికి ఎవరు అనుమతులు ఇచ్చారన్నదానిపై రాజకీయ రగడ ప్రారంభమయింది. లాక్ డౌన్ సడలింపులో భాగంగా నిత్యావసర వస్తవుల పరిశ్రమలకు మాత్రమే ప్రారంభించే అవకాశం ఇచ్చారని ..కానీ ప్లాస్టిక్ పరిశ్రమకు ఎన్వోసీ ఎలా వచ్చిందని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముందు ఈ అంశంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ ప్రమాదం కేంద్రంగా ఇంకా పూర్తి స్థాయిలోరాజకీయం ప్రారంభం కాలేదు. మాట్లాడితే రాజకీయం చూసుకునే ఏపీలో పరస్పర ఆరోపణలు ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.