కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో భారీ వివాదం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది విద్యుత్ రంగంలో. విద్యుత్ వ్యవస్థపై మొత్తం పెత్తనానికి కేంద్రం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలను తీసుకురానుంది. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ను సిద్దం చేసి రాష్ట్రాలకు పంపింది.
విద్యుత్ వ్యవస్థను కైవసం చేసుకునే దిశగా కేంద్రం..!
కేంద్రం తీసుకొస్తున్న సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరి సభ్యుల నియామకం పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అంతే కాదు.. విద్యుత్ పంపిణీ సంస్థలపై అధికారాలు కూడా కేంద్రానికే వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ ధరల పెంపు.. తగ్గింపుపై.. రాష్ట్రాలకు అధికారం ఉండదు. ఒప్పందాలకు చాన్స్ ఉండదు. ఒప్పందాల సమీక్షకు కూడా చాన్స్ ఉండదు. ఓ రకంగా విద్యుత్.. కేంద్ర అంశంగా మారిపోతుంది. ఒకే దేశం.. ఒకే ధర అన్న విధానంతో దేశం మొత్తం ఒకే విద్యుత్ రేటు అమలు చేస్తారు.
బిల్లును సమర్థించే ప్రశ్నే లేదన్న తెలంగాణ సర్కార్..!
దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని.. ప్రైవేటీకరణకు కేంద్రం వ్యూహం రూపొందించిందని విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి నేరుగానే అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కేంద్రం చెబుతున్న చట్టం అమలులోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ ఆగిపోతుందని.. గృహవినియోగదారులపై అదనపు భారం పడుతుందని అంటున్నారు.
వ్యతిరేకత ఎలా చేయాలో తెలియక ఏపీ సర్కార్ సతమతం..!
ఏపీ సర్కార్ కు కూడా కేంద్రం ఈ బిల్లు ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. కానీ మద్దతివ్వాలా.. వ్యతిరేకించాలా.. అన్నదానిపై ఆయన స్పష్టతకు రాలేదు. మరోసారి సమీక్ష నిర్వహిద్దామని ఉన్నతాధికారులకు సీఎం జగన్ తెలిపారు. అంతర్గతంగా మాత్రం.. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను లాగేసుకోవడమేనని.. విద్యుత్ వ్యవస్థపై కేంద్రానికే నియంత్రణ వెళ్తే.. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్రం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. తెలంగాణ సర్కార్‌కు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు. అందుకే.. ఎలా తమ వ్యతిరేకత తెలియ చేయాలా.. అన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.
ఏపీ సర్కార్ నిర్ణయాల వల్లే కేంద్రానికి ఈ బిల్లు ఆలోచన..!?
నిజానికి కేంద్రానికి విద్యుత్ వ్యవస్థను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనే ఆలోచన లేదు. ఏపీ సర్కార్ నిర్ణయాల వల్లే ఈ ఆలోచన వచ్చింది. విద్యుత్ ధరలను తగ్గించాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రం నోటీసులు జారీ చేస్తుండటం, సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు కేంద్రం వద్ద పంచాయితీ పెట్టాయి. ఇవన్నీ ఏపీలోనే జరిగాయి. జగన్ సీఎం అయిన తర్వాత పీపీఏలపై జరిగిన రచ్చ పరిణామాలే ఇవి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించింది. ఇందుకోసం కేంద్రం పరిధిలో కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని కూడా ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో పేర్కొంది. ఒకసారి ఈ అథారిటీ ఏర్పడ్డాక రాష్ట్రాలు పీపీఏలను పున:సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు.