‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ టాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్. బిగ్ బాస్ బ్లాక్బస్టర్. ఈ సినిమా విడుదలై శనివారానికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో బాగంగా ఈ సినిమా రచయితల్లో ఒకరైన యండమూరి కధకు సంబధించి ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పారు.
“అశ్విన్ దత్ కి చక్రవర్తి అనే రచయిత ఓ కధ చెప్పి అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. కధ ఏమీ లేదు. ఒక దేవకన్య భూమిపైకి వచ్చి ఉంగరం పారేసుకుంటుంది. చివరి ఆమె దేవలోకం ఎలా వెళ్ళింది ? అనేది పాయింట్. ఆ రచయిత ఇదే చెప్పాడు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ జగదీకవీరుడు లైనే ఇది. ఈ లైన్ ని ఇంక వండటం మొదలుపెట్టాం. ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. షూటింగ్ కూడా చేశాం. తర్వాత షూటింగ్ ఆగిపోయింది. కారణం సెకండ్ హాఫ్ లేదు. ఏం రాయాలో కూడా అర్ధం కాలేదు. ఈలాంటి స్థితిలో వుండగా మా అబ్బాయి ‘డేట్ విత్ ఎన్ ఏంజెల్’ అనే సినిమా డీవీడీ ఇచ్చాడు. చూశాను. మంచి పాయింట్ దొరికింది. ఒక దేవకన్య మనిషిని తన చేతితో నిమిరి అతడ్ని కోలుకునేలా చేసే సీన్ అది. ఇదే సీన్ ఇంటర్వెల్ తర్వాత కధ నడిపించడానికి ఒక ఐడియా ఇచ్చింది” అని చెప్పుకొచ్చారు యండమూరి.
యండమూరి చెప్పిన సంగతి ఆసక్తికరంగానే వుంది. ఎలాంటి మొహమాటాలు లేకుండా ఫలానా సినిమా నుండి ఓ సీన్ కి ప్రేరణ పొందానని చెప్పడం హుందాగా వుంది.