విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైంది స్టైరిన్ గ్యాస్ మాత్రమే కాదని.. అందులో మరిన్ని విషవాయువులు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాయువుల వల్లనే చాలా మంది తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారని.. ప్రస్తుతానికి కొంత మంది కోలుకున్నా.. భవిష్యత్లో వారికి తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గుతేల్చి.. అసలు లీకైంది ఏ వాయువులో గుర్తించి.. దానికి తగ్గట్లుగా.. చికిత్సలు.. తదుపరి చర్యలు తీసుకుంటనే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని.. చంద్రబాబు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సమగ్ర వివరాలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై.. కేంద్రం స్పందించిన తీరుపై మొదటగా అభినందనలు తెలిపిన చంద్రబాబు… లేఖలో..దర్యాప్తు చేయాల్సిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు. గ్యాస్ లీకేజీపై సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని .. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలని కోరారు. లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతోంది. స్టైరీన్తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయిని.. అంతర్జాతీయ వైద్య నిపుణులతో పరిశీలనలు జరిపిస్తేనే నిజం బయట పడుతుందని చంద్రబాబు ఉన్నారు. దానికి అనుగుణంగా తక్షణ, దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపడితేనే అక్కడి ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. విషవాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయి .. తక్షణం దృష్టి సారించి చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.
ప్రమాదం జరిగిన రోజు విశాఖ పర్యటనకు వెళ్లాలనుకున్న చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ అడిగారు. రోడ్డు మార్గం ద్వారా సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక విమానం కోసం అనుమతి అడిగారు.అయితే.. దీనిపై ఇంత వరకూ కేంద్రం నుంచి స్పందన రాలేదు. దాంతో ఆయన విశాఖకు వెళ్లలేకపోయారు. చంద్రబాబు బుక్ చేయాలనుకున్న విమానం ముంబై ఎయిర్ పోర్టులో ఉంది. మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో.. ప్రయాణం సాధ్యం కావడం లేదు. దాంతో.. చంద్రబాబు హైదరాబాద్ నుంచే . విశాఖ పరిణామాలపై స్పందిస్తున్నారు.