విశాఖలో ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధితుల ఆక్రందనలు.. ఆందోళనలు పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదు..వినిపించడం లేదన్నట్లుగా ఉంది. ఈ సమయంలో ఆందోళనలు మంచిది కాదంటూ… ఆయన తన క్యాడర్‌కు సందేశం పంపారు. ఓ వైపు…. తమ వైపు నుంచి చిన్న తప్పు లేకుండానే ఐదు గ్రామాలకు చెందిన ఇరవై వేల మంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పన్నెండు మంది చనిపోయారు. వందల మంది ఆరోగ్యపరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ప్రజాధనాన్ని నష్టపరిహారంగా ప్రకటించేసిన ఏపీ సర్కార్… కంపెనీపై ఈగ వాలనీయడం లేదు. పైగా బాధితులకు అందులోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రకటించడం ద్వారా పరిశ్రమ అక్కడే ఉంటుందని చెప్పేశారు.
దాంతో ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు… తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలతో..పరిశ్రమ ముందు ధర్నా చేశారు. పరిశ్రమను అక్కడ్నుంచి తరలించాల్సిందేనంటున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. గ్యాస్ దెబ్బకు చెట్లు అన్నీ ఎండిపోయాయి. ద్విచక్ర వాహనాలు కూడా ఉబ్బిపోయాయి. అలాంటిది ఆ గ్యాస్ పీల్చుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల కోసం అందరూ పోరాడుతూంటే.. పవన్ కల్యాణ్ మాత్రం జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచించారు.
ఆందోళనకు ఇది సమయం కాదనీ.. బాధితులకు అండగా ఉండాల్సిన సమయమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే..కరోనా వ్యాపిస్తుందని చెబుతున్నారు. కరోనా భయం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఓపెన్ చేస్తే..పవన్ మాత్రం.. ప్రభుత్వంపై పోరాటం చేయకుండా ఉండటానికి కరోనాను కారణంగా చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.