వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్ర వ్యతిరేకత చూపే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో భిన్నమైన పలుకు పలికారు. ఆయన రాజకీయంగా… దిగ్గజాలను అధిగమించే రేంజ్లో రాజకీయాలు చేస్తున్నారని.. నేరుగా కాకుండా పరోక్షంగా కితాబునిచ్చేశారు. ఎన్టీఆర్, జగన్ తండ్రి వైఎస్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీరెవ్వరూ చేయని.. చేయలేకపోయిన రాజకీయంతో .. .జగన్ తన ఓటు బ్యాంక్ స్థిరపర్చుకుంటున్నారని.. ఆర్కే విశ్లేషించారు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయం భిన్నం. ఆయన అందర్నీ మెప్పించాలనుకోరు. మెజార్టీ ప్రజలను మెప్పిస్తే చాలనుకుంటున్నారు. అందుకే కొన్ని సామాజికవర్గాలను టార్గెట్ చేసి మరీ ఎన్నికల వ్యూహాన్ని రచించారు. ఇప్పుడు.. అదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి ఆర్కే అంటున్నారు. కమ్మవాళ్లు ఎలాగూ… తనకు మద్దతుగా రారు.. వారిపై ఇతర కులాల్లో ఉన్న ద్వేషాన్ని జగన్ ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. కాపులపై బీసీ కులాల్లో ఉన్న కోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన ప్రాధాన్యతతో బీసీలు దూరమయ్యారని.. వారంతా.. జగన్ కు ఓటేశారని.. టీడీపీకి మద్దతుగా ఉండే బీసీ ఓటు బ్యాంక్ అలా ఆకర్షించడం ద్వారా.. తన రాజకీయ పునాదుల్ని జగన్ పటిష్టం చేసుకుంటున్నారనేది ఆర్కే విశ్లేషణ.
జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలతో.. బలహీనవర్గాల శ్రేయోభిలాషిగా పేరుకు పేరు కూడా సంపాదించుకున్నారని ఆర్కే తన ఆర్టికల్లో తీర్పు ఇచ్చారు. కోర్టులు కొట్టివేసినా… పేదలు చదువు కోకూడదా… మద్యం మాన్పించడానికి రేట్లు పెంచకూడదా అనే వాదనలతో ప్రతిపక్షాలను జగన్… ఆత్మరక్షణలోకి నెట్టేశాడని ఆర్కే చెబుతున్నారు. చెప్పిన హామీలు నెరవేర్చకపోయినా… జీతాలు సగానికి సగం తగ్గించి ఇస్తున్నా.. ఉద్యోగ సంఘాలు నోరు తెరవలేకపోతున్న విషయాన్ని ఆర్కే తన ఆర్టికల్లో ప్రస్తావించారు. కేసులతో తెలుగుదేశం పార్టీ నేతలను ఎప్పుడో జగన్ కట్టడి చేశారని.. తేల్చారు. చివరికి విశాఖపట్నంలో అంత పెద్ద ప్రమాదం జరిగినా.. మృతులకు రూ. కోటి ప్రకటించి.. అందరితో పొగడ్తలు పొందుతున్నారన్నారు.
ఆర్కే ఆర్టికల్ శైలి మారింది. జగన్ కు కాస్త నెగెటివ్ సెన్స్ వచ్చేలా ఆర్టికల్లో ఉన్న కథనం ఉన్నా.. పూర్తిగా.. జగన్ .. ఇతర పార్టీల నేతలను మించి రాజకీయం చేస్తున్నారని చెప్పకనే చెప్పారు. రాజకీయ పార్టీలకు కావాల్సింది గెలుపు మాత్రమే. దాని కోసం ఆయా పార్టీ అధినేతల ఆలోచనలకు తగ్గట్లుగా వ్యూహాలు ఎంచుకుంటారు. జగన్ స్టైల్లో జగన్ వెళ్తారు. ఇప్పటి వరకూ.. ఆ వ్యూహాలన్నీ తప్పని వాదించిన ఆర్కే.. ఈ వారం నుంచి కొత్త బాట పట్టారని.. కొత్త పలుకు వినిపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.