దేశంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. పన్నెండో తేదీ నుంచి రైళ్లు ప్రారంభం అవుతాయి. అయితే అన్నీ కాదు. మొదటగా పరిమితంగా మాత్రమే రైళ్లను నడపనున్నారు. కేవలం 30 రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నారు. అనంతరం దశలవారీగా ప్రారంభిస్తారు. సోమవారం సాయంత్రం నుంచి ఐఆర్సీటీసీ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ రైళ్లన్నీ దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ నడుస్తాయి. ఇవన్నీ..ప్రత్యేక రైళ్లుగా నడుస్తాయి. రెగ్యులర్ సర్వీసులు కాదు.
మెల్లగా సాధారణ జన జీవనాన్ని తీసుకు రావాలనుకుంటున్న కేంద్రం.. అన్నింటినీ ఒకే సారి ప్రారంభిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేసింది. అందుకే… ప్రతీ పబ్లిక్ సర్వీస్‌ని..మొదట కొద్దిగా ప్రారంభించి..ఆ తర్వాత క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లనున్నారు. నెలాఖరు లోపు.. పూర్తి స్థాయి రైలు సర్వీసులు నడిపే అవకాశం ఉంది. విమానాలకు కూడా.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత అంటే 18వ తేదీ నుంచి అనుమతిచ్చే అవకాశం ఉందంటున్నారు.
బస్సులు నడిపే అంశం మాత్రం..రాష్ట్రాలకు వదిలేయనున్నట్లుగా చెబుతున్నారు. రైల్వేశాఖ ఇప్పటికే శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. అయితే..ఆ శ్రామిక్ రైళ్లు కేవలం వలస కూలీలకు మాత్రమే. ప్రభుత్వాల వద్ద రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రమే. ఇప్పుడు నడుపుతున్నవి పబ్లిక్ అందరికీ. లాక్ డౌన్ ఎత్తివేత అంశంలో ఈ పరిణామం కీలక అడుగుగా భావిస్తున్నారు.