విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన గ్యాస్ ప్రభావం ఇంకా చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంది. సమీపంలోని రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న గూడ్స్ రైలు లోకోపైలట్, గార్డ్ ఇద్దరూ… వాయువు కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. ప్రభుత్వం అంతా బాగుందని చెప్పిన తర్వాతనే తాము రైలు నడిపామని.. అదే శ్రామిక రైలును నడుపి ఉంటే.. పరిస్థితి తీవ్రంగా ఉండేదని.. రైల్వే అధికారులు భగ్గుమంటున్నారు. ఈ ఘటనతో… ఎల్జీ పాలిమర్స్‌ను లీకైన వాయువు ప్రభావం తగ్గలేదని..అంచనాకు వస్తున్నారు.
ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అనుమతించడం లేదు. వారు ఇంకా.. చెట్టుకొకరు.. పుట్టకొకరు చొప్పున బయటే కాలం వెళ్లదీస్తున్నారు. పుణె, ఢిల్లీ నుంచి పర్యావరణ నిపుణులు, రసాయ నిపుణులు వచ్చి… అక్కడి గ్రామాల్లోని నీరు, మట్టి శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని పుణె ల్యాబ్స్‌కు తరలించారు. అక్కడ నుంచి వచ్చే రిపోర్టును బట్టే… గ్రామాలు నివాసయోగ్యమా కాదా.. అన్నదాన్ని డిసైడ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నివాస యోగ్యం కాదంటే.. తాము ఎక్కడికిపోతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలిస్తే.. ఇవాళ కాకపోతే.. రేపైనా… నివాస యోగ్యంగా ఆ ప్రాంతం మారుతుందని.. కానీ పరిశ్రమను తరలించే ఆలోచన చేయకుండా..తమ గ్రామాలు నివాసయోగ్యమా కాదా.. అని ఎలా చెబుతారన్న సందేహాలు.. ఆయా గ్రామాల వాసుల్లో వస్తున్నాయి.
అంత విషం చిమ్మిన ఎల్జీ పాలిమర్స్ అసలు ఇక కార్యకలాపాలు నిర్వహించడానికి పనికి వస్తుందాలేదా.. అన్నదానిపై ఏ ఒక్కరూ పరిశీలన చేయడం లేదు. ఆ కంపెనీ చేసిన తప్పులేమిటో బయటకు రావడం లేదు. కేవలం గ్యాస్ లీకేజీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా.. ఆ పరిస్థితి రావడానికి స్టైరిన్ గ్యాస్‌నే నిందిస్తున్నారు. ఆ గ్యాస్ విశాఖలో ఉండకూడదని ఆదేశించారు. కానీ పరిశ్రమ గురించి మాత్రం.. ఒక్క మాట మాట్లాడలేదు. దీంతో పరిశ్రమను అక్కడే ఉంచి.. గ్రామాలను ఖాళీ చేయించేస్తారన్న భయం అక్కడి గ్రామాల వాసుల్లో ప్రారంభమయింది.