తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల కాలంలో కరెంట్ చార్జీలు పెంచలేదు. ఇక పెంచేది లేదని.. తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు చెప్పేవారు. అయితే.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అని … విమర్శలు గుప్పించేవారు. కరెంట్ బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయని… చంద్రబాబు దోచేస్తున్నారని అనేవారు. కరెంట్ చార్జీలు పెంచకుండా.. ఎక్కువ ఎలా వస్తాయన్న లాజిక్ పక్కన పెడితే… ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ మొత్తం గగ్గోలు పెడుతోంది. కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయని అందరూ వాపోతున్నారు.
లాక్ డౌన్ కారణంగా… గత నెలలో మీటర్ రీడింగ్ తీయలేదు. కానీ ఈ నెల తీస్తున్నారు. రెండు నెలల పాటు వాడిన కరెంట్ యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. సాధారణంగా… శ్లాబ్‌ల ప్రకారం.. 100 యూనిట్లలోపు వాడితే బిల్లు కూడా వంద లోపే వస్తుంది. ఆ పైన దాటితే మాత్రం పెరుగుతుంది. 200 యూనిట్లు దాటితే.. బిల్లు వేలకు చేరుతుంది. అందుకే మధ్యతరగతి జీవులు.. మీటర్ చూసుకుంటూ కరెంట్ వినియోగిస్తారు. ఇప్పుడు అరవై రోజుల బిల్లు కావడంతో.. ఎవరికీ.. వెయ్యి తక్కువ రాలేదు. రూ. వంద.. రెండు వందలు నెలకు బిల్లు కట్టే వారికి వెయ్యి పైనే వచ్చింది. మిగతా వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. అందుకే.. ఏపీ మొత్తం.. కరెంట్ కు గురైనట్లుగా మారిపోయింది.
మీటర్ రీడింగ్ తీయడం లేదు కాబట్టి… రెండు నెలల రీడింగ్ తీసినప్పుడు.. సగం సగం బిల్లు వేస్తామని ఏపీ అధికారులు చెప్పారు. గత ఏడాది మార్చిలో వచ్చిన బిల్లు కట్టాలని సూచించారు. చాలా మంది అలా కట్టారు. కానీ ఇప్పుడు.. మొత్తానికి శ్లాబ్ మార్చేసి బిల్లు వేసి.. కట్టిన మొత్తం తగ్గిస్తున్నారు. అక్కడే తేడా వస్తోంది. ప్రజల గగ్గోలు పెరగడంతో.. విద్యుత్ సంస్థలు తప్పు దిద్దుకునే పనిలో పడ్డాయి. అయితే.. బిల్లులు తగ్గించడంలో కాదు.. కరెక్టే చేస్తున్నామనే వాదన వినిపించడానికి సిద్ధపడుతున్నాయి. ప్రజలు మాత్రం.. జగనన్న నిజంగానే షాక్ కొట్టించేశారని.. నోరు తెరుస్తున్నారు.