వీలైనంత త్వరగా థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు హైదరాబాద్ థియేటర్ల యజమానులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటడంతో యాభై రోజులుగా ధియేటర్లు తెరవడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత గతంలోలా ధియేటర్లు నిండే పరిస్థితిలేదు.
ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకున్నప్పుడే ఒక సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండకుండా సాంకేతిక మార్పులు చేయబోతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకేచోట సీట్లు కావాలంటే కేటాయించే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. సాధారణంగా ఒక ఆట పూర్తై పది నిమిషాల్లోనే మరో షో మొదలవుతోంది. ఇకముందు 45 నిమిషాల తర్వాతే మొదలుపెడతారు. దీన్నిబట్టి రోజుకు నాలుగు ఆటలకు బదులు మూడే ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇక కాగితం రూపంలో టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇక క్యూఆర్‌కోడ్‌తో టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు.
దీన్ని స్కాన్ చేసి హాలు లోపలికి పంపిస్తారు. తినుబండారాల స్టాల్స్ వద్ద, మరుగుదొడ్ల దగ్గర, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవరణలో ఎక్కడా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు. ఇవే కాకుండా ప్రభుత్వం సూచించే అన్ని నిబంధనల అమలుకు కార్యాచరణ రూపొందిస్తారు. ఇన్ని చేసినా జనం థియేటర్ కి వస్తారా అన్నదే ప్రధాన ప్రశ్న. సీటు మార్చిసీటుటిక్కెట్ అమ్మితే కలెక్షన్ సగానికి పడిపోతుంది. ఈ సమస్యలన్నీ అధిగమించడం..ధియేటర్ యజమానులకు అంత తేలిక కాదు.