ఓటీటీ – వెండి తెర మధ్య నలిగిపోతున్నారు నిర్మాతలు. తమ సినిమాల్ని థియేటర్లో విడుదల చేసుకోవాలా? లేదంటే ఓ టీ టీకి అమ్ముకుని, ఎంతొస్తే, అంతొచ్చిందని సంతృప్తి పడిపోవడం బెటరా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. పెద్ద సినిమాలు ఎలాగూ ఓటీటీ రేట్లకు లొంగిపోవు, చిన్న, మధ్యతరగతి సినిమాలు మాత్రం వాటి వైపు మెల్లిగా వెళ్తున్నాయి. ఇప్పుడు మరో సరికొత్త ఆలోచన కూడా వచ్చింది. సగం సినిమా ఓ టీటీకి అమ్ముకుంటే ఎలా ఉంటుందని?
నాని – సుధీర్ బాబు ల సినిమా `వి` విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై కూడా ఓటీటీ కన్ను పడింది. బేరాలు సాగాయి.కానీ.. నిర్మాత దిల్ రాజు లొంగలేదు. ఓ దశలో సగం సినిమాని ఓటీటీకి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట. ఈసినిమాలో ఇంట్రవెల్ ట్విస్టు చాలా కీలకం. అక్కడి నుంచి కథ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. సగం సినిమా ఓటీటీలో విడుదల చేస్తే.. ఆ ట్విస్టు కోసమైనా జనాలు థియేటర్లకు వస్తారు కదా.. అని చిత్రబృందం భావించిందట. అటు ఓటీటీ డబ్బులు, ఇటు థియేటరికల్ రైట్స్ రెండూ రాస్తాయి. కాకపోతే ఈ ఆలోచన ఆచరణ సాధ్యం కాలేదు. ”ఈ సినిమాలో విశ్రాంతి ట్విస్టు చాలా బాగుంటుంది. బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు? అనే స్థాయిలో ఆలోచనలో పడేస్తుంది. అందుకే తొలి సగం సినిమా ఓటీటీకి ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే బాగుంటాయి. అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాం” అన్నాడు సుధీర్ బాబు.
ఇలాంటి ఆలోచనలు థ్రిల్లర్ సినిమాలకే పనికొస్తాయి. సగం సినిమా చూసి, ట్విస్టు రుచి తెలుసుకుని – సినిమాని మధ్యలో ఆపేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. పూర్తి సినిమా కోసం థియేటర్లో వచ్చే వరకూ ఎదురు చూస్తుంటారు. కానీ.. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్టైన్ మెంట్ లాంటి కథలకు ఈ వ్యూహం ఏమాత్రం ఫలించదు.
సగం సినిమాని అమ్మాలని చూస్తే ఓటీటీ సంస్థలు తీసుకోవడానికి రెడీగా ఉంటాయా? అప్పుడు వాళ్ల రేట్లు ఎలా ఉంటాయి? ఇంట్రవెల్ వరకూ సినిమా చూసి, మిగిలిన సగం కోసం ప్రేక్షకుడు థియేటర్ వరకూ వస్తాడా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అంశాలు. చూపించిన సగం సినిమా ప్రేక్షకుడికి నచ్చకపోతే.. మొదటికే మోసం వస్తుంది.